RCB practice session: కోహ్లీ భద్రతకు ముప్పు వల్లే.. బెంగళూరు ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు..!

RCB practice session: ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు బెంగళూరు అనూహ్యంగా తన ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచివున్న నేపథ్యంలో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Updated : 22 May 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరుకు వేళైంది. లీగ్‌ రెండో దశ నుంచి గేర్‌ మార్చిన బెంగళూరు నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ (Eliminator Match)లతో రాజస్థాన్‌ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే దీనికి ముందు మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌ (Practice Session) ఉండగా బెంగళూరు జట్టు అనూహ్యంగా దాన్ని రద్దు చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను (Suspicion of terrorist activities) గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, కొన్ని వీడియోలు, సందేశాలను స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి బెంగళూరు, రాజస్థాన్‌ జట్లకు పోలీసులు సమాచారమిచ్చారు. ఈ క్రమంలోనే స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Security Threat to Virat Kohli) భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బెంగళూరు తన ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుందని గుజరాత్‌ పోలీసు అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేగాక, ఇరు జట్లు నిన్న మీడియా సమావేశంలోనూ పాల్గొనలేదు.

సెకండాఫ్‌లో బెంగళూరు దూకుడుకు ఈ 5 అంశాలే కారణమా?

‘‘అహ్మదాబాద్‌కు రాగానే అరెస్టుల విషయం కోహ్లీ (Virat Kohli)కి తెలిసింది. అతడు మన జాతీయ నిధి. అతడి భద్రత మనకు అత్యధిక ప్రాధాన్యం. అందుకే తాము రిస్క్‌ తీసుకోదల్చుకోలేదని బెంగళూరు యాజమాన్యం చెప్పింది. ప్రాక్టీస్‌ సెషన్‌ నిర్వహించబోమని తెలిపింది. అయితే, రాజస్థాన్‌ జట్టు మాత్రం యథావిధిగా తమ ప్రాక్టీస్‌ కొనసాగించింది’’ అని పోలీసు అధికారి విజయ్‌సింఘ జ్వాలా చెప్పినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి.

అంతేగాక, బెంగళూరు ఆటగాళ్లు ఉన్న హోటల్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ జట్టు సభ్యుల కోసం ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటుచేశారు. ఐపీఎల్‌ అనుబంధ మీడియా సిబ్బందిని కూడా లోనికి అనుమతించడం లేదని సమాచారం. అటు రాజస్థాన్‌ జట్టు కూడా నిన్న ప్రాక్టీస్‌ సెషన్‌ కోసం గ్రీన్‌ కారిడార్‌లో మైదానానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ జట్టు ప్రయాణిస్తున్న బస్సును మూడు పోలీసు వాహనాలు ఎస్కార్ట్‌ చేసినట్లు సమాచారం. వీరు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో గ్రౌండ్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారని సదరు కథనాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని