IPL - RCB: ఆర్సీబీ పేరులో మార్పు?.. హింట్‌ ఇచ్చిన ఫ్రాంఛైజీ

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ఆర్సీబీ (RCB) తన పేరులో చిన్న మార్పు చేసుకునే అవకాశం ఉంది. 

Published : 13 Mar 2024 20:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL)లో భారీ అభిమానగణం ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడే ఈ జట్టు తనదైన రోజు ఎంతటి బలమైన టీమ్‌నైనా చిత్తుగా ఓడించగలదు. లీగ్‌ దశలో బాగా ఆడి కీలకమైన ప్లేఆఫ్స్‌లో చేతులెత్తేస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఈసారైనా టైటిల్‌ కల నెరవేరాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా.. ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ఆర్సీబీ తన పేరులో చిన్న మార్పు చేసుకునే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఆర్సీబీ తమ జట్టు పేరును ఆంగ్లంలో (Royal Challengers Bangalore) అని రాస్తోంది. ఇకపై (Royal Challengers Bengaluru) అని మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఆర్సీబీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో ఇందుకు ఊతమిస్తోంది. ఈ వీడియోలో కన్నడ నటుడు రిషభ్ శెట్టి.. రాయల్‌ (Royal), ఛాలెంజర్స్‌ (Challengers), బెంగళూరు (Bangalore) అని రాసి ఉన్న మూడు దున్నల దగ్గరకు వస్తాడు. అనంతరం బెంగళూరు (Bangalore) అని రాసి ఉన్న దున్నను తీసుకెళ్లమని దానికి కాపలాగా ఉన్న వ్యక్తితో చెబుతాడు. ఆర్సీబీ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘రిషబ్ శెట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైందా? ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌లో అదేంటో మీకు తెలుస్తుంది. మీ టికెట్‌లను ఇప్పుడే కొనండి’’ అనే వ్యాఖ్యను జత చేసింది. స్థానిక అభిమానుల కోరికమేరకు ఆర్సీబీ ఈ మార్పు చేస్తోందట. మార్చి 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌లో పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మార్చి 22న సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభం కానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని