Ricky Ponting: ఇప్పుడు భారత ప్రధాన కోచ్‌గా రాలేను..: రికీ పాంటింగ్

భారత ప్రధాన కోచ్‌ పదవికి ఉన్నంత డిమాండ్‌ మరెక్కడా ఉండదేమో. అదే సమయంలో ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును నడిపించడం సాధారణ విషయం కాదు.

Published : 23 May 2024 18:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో నాలుగు రోజుల్లో భారత ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఈ రేసులో కొత్త పేర్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే స్టీఫెన్ ప్లెమింగ్, జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, సెహ్వాగ్.. ఇలా లిస్ట్‌ చాలా ఉంది. అయితే, ఇప్పటివరకు ‘మేం రెడీ’ అంటూ ఎవరూ చెప్పలేదు. అసలు ఎవరు దరఖాస్తు చేశారనేదీ బీసీసీఐ వెల్లడించలేదు. తాజాగా ఆసీస్‌ మాజీ కెప్టెన్, దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) ‘ఈసారి’ నేను అప్లై చేయడం లేదంటూ స్పష్టంచేశాడు. దానికి కారణం ఏంటనేది కూడా వెల్లడించాడు. 

‘‘భారత ప్రధాన కోచ్‌ పదవి అత్యంత క్లిష్టమైందని ఇప్పటికే చెప్పా. బాధ్యతలు చేపట్టిన వ్యక్తిపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే, నేను ఇప్పుడు ఈ స్థానంలో పని చేసేందుకు సిద్ధంగా లేను. తప్పకుండా భవిష్యత్తులో దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోలేదు. సీనియర్ జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం అత్యంత గౌరవంగా భావిస్తా. కానీ, ఈసారి మాత్రం అలాంటి అవకాశం లేదు. వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమైందే. కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సి ఉంది. ఇక భారత కోచ్‌గా దాదాపు పది నెలలపాటు విధుల్లోనే ఉండాలి. ఐపీఎల్‌తో సంబంధం ఉండకూడదు. 

ఇప్పుడు నా జీవన శైలికి అది సరిపడదు. జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు గత ఐదు వారాలు నా కుటుంబం, పిల్లలు నాతోనే ఉన్నారు. ప్రతి ఏడాది ఇలా రావడం చాలా బాగుంటుంది. భారత ప్రధాన కోచ్‌గా మాత్రం అలాంటి అవకాశం ఉండదు. అయితే, నా కుమారుడు మాత్రం ఈ ఛాన్స్‌ వస్తే వదులుకోవద్దని సూచించాడు. ఇప్పుడు మాత్రం దానికి సరిపోయేలా జీవనశైలి లేదని కచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి’’ అని  పాంటింగ్‌ వెల్లడించాడు. ప్రస్తుత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. కొత్తగా వచ్చే కోచ్‌ 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు జట్టును నడిపించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని