Rinku Singh: వరల్డ్‌ కప్‌ జట్టుకు నేను ఎంపిక కాకపోవడానికి కారణమదే: రింకు సింగ్

జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది. ఇప్పటికే భారత స్క్వాడ్‌ అమెరికాకు చేరుకుంది. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ రింకు సింగ్‌కు ప్రధాన జట్టులో ఈసారి అవకాశం దక్కలేదు.

Updated : 29 May 2024 10:45 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ కోసం (T20 World Cup 2024) ప్రకటించిన జట్టులో రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. ట్రావెల్ రిజర్వ్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. గతేడాది నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నా జట్టులో చోటులేకపోవడంపై బాధ ఉంటుందని.. అయితే, సరైన కూర్పు కోసమే  మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుని ఉంటుందని రింకు సింగ్‌ (Rinku Singh) అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ముంబయితో మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మతో (Rohit Sharma) సంభాషణపైనా స్పందించాడు. 

స్టార్క్‌కు రూ.25 కోట్లు.. నీకు రూ.55 లక్షలేనా?ఈ ప్రశ్నకు రింకు సూపర్ ఆన్సర్

‘‘మంచి ప్రదర్శన చేసినా జట్టులోకి ఎంపిక కాకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. ఈసారి నన్ను తీసుకోకపోవడానికి కారణం జట్టు కూర్పే అనుకుంటున్నా. మన చేతుల్లో లేని అంశాల గురించి ఆలోచించకూడదు. జట్టు ప్రకటన వచ్చాక నేను కాస్త అప్‌సెట్ అయిన మాట వాస్తవం. అయితే, ఏం జరిగినా మన మంచికే అనుకుంటా. కెప్టెన్ రోహిత్ భయ్యా ప్రత్యేకంగా దీని గురించి ఏం చెప్పలేదు. కఠిన శ్రమను చేస్తూ వెళ్లమని మాత్రమే చెప్పాడు. మరో రెండేళ్లలో మళ్లీ వరల్డ్‌ కప్‌ వస్తుంది. ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ ఆటతీరును కొనసాగిస్తూ ఉంటే తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పాడు’’ అని రింకు తెలిపాడు. ఆల్‌రౌండర్ల రూపంలో శిమవ్‌ దూబె, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉండటంతో రింకుకు అవకాశం దక్కలేదనేది క్రికెట్ విశ్లేషకుల మాట.

అంతా గంభీర్‌ సర్ వల్లే..

పదేళ్ల తర్వాత కోల్‌కతా ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 17వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఏకపక్ష విజయం సాధించిన కేకేఆర్‌ ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. తమ జట్టు ఛాంపియన్‌గా నిలవడంపై రింకు సింగ్ స్పందించాడు. ఇదంతా తమ జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) వల్లేనని వ్యాఖ్యానించాడు. ‘‘ఈ విజయం గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. కల నెరవేరింది. కేకేఆర్‌తో ఏడేళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నా. ఈ క్రెడిట్‌ అంతా గంభీర్‌కే దక్కుతుంది. ఇదంతా దేవుడి ప్లాన్‌. ఎట్టకేలకు ఐపీఎల్‌ ట్రోఫీని ఎత్తుకోగలిగా’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని