Rishabh Pant: ఈసారి జట్టుకూ ఫైన్‌.. రిషభ్‌ పంత్‌కు జరిమానా డబుల్‌!

దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు (Rishabh Pant) మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. మ్యాచ్‌లో ఓడిపోవడమే కాకుండా.. మరోసారి జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

Published : 04 Apr 2024 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో దిల్లీ జట్టుకు ఓటమి ఎదురైంది. కోల్‌కతా నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ 166 పరుగులకే పరిమితమైంది. ఇప్పటి వరకు దిల్లీ నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న దిల్లీకి ఐపీఎల్‌ షాక్‌ ఇచ్చింది. కోల్‌కతాతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మళ్లీ దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు, జట్టులోని సభ్యులకూ జరిమానా విధించింది. అయితే, రెండోసారి కావడంతో భారీ మొత్తం పడటం గమనార్హం. పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ ప్రకటన జారీ చేసింది.

‘‘ఈ సీజన్‌లో దిల్లీ మళ్లీ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదానికి పాల్పడింది.  దిల్లీ సారథి రిషభ్ పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించాం. పంత్‌తోపాటు జట్టులోని మిగిలిన సభ్యులకూ ఫైన్‌ విధించడం జరిగింది. అందులో ఇంపాక్ట్ ప్లేయర్‌కూ వర్తిస్తుంది. ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్‌ ఫీజుల్లో 25 శాతం ఈ రెండింట్లో ఏది తక్కువైతే దానిని జరిమానాగా విధించాం’’ ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటన చేశారు. 

డీఆర్‌ఎస్‌ తీసుకున్నట్లా? లేనట్లా? 

టాస్‌ నెగ్గిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్ సునీల్ నరైన్ దూకుడుగా ఆడేశాడు. అయితే, నాలుగో ఓవర్‌లో నరైన్‌ను ఔట్ చేసే అవకాశం వచ్చింది. ఇషాంత్ వేసిన ఆ ఓవర్‌లో అప్పటికే నరైన్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. నాలుగో బంతిని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో విసిరాడు. దానిని నరైన్‌ కొట్టే క్రమంలో మిస్‌ అయి వికెట్‌ కీపర్‌ పంత్ చేతిలో పడింది. పక్కన ఫీల్డింగ్‌ చేస్తున్న మిచెల్ మార్ష్ బ్యాట్‌ను బంతి తాకిందన్నట్లుగా భావించి డీఆర్‌ఎస్‌ తీసుకోవాలని సూచించాడు. కానీ, బౌలర్‌, పంత్‌ మాత్రం కాస్త తటపటాయించారు. చివరికి మరో రెండు సెకన్లలో టైమర్‌ ముగుస్తుందనగా.. పంత్‌ డీఆర్‌ఎస్‌ సిగ్నల్‌ చూపించాడు. అప్పటికి టైమర్‌ ‘0’ మీదకు వచ్చేసింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ దానిని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం దిల్లీ అభిమానులు అంపైరింగ్‌పై విమర్శలు గుప్పించారు. పంత్ సరైన సమయానికి రివ్యూ అడిగాడని.. కానీ, అంపైర్లు పట్టించుకోలేదని కామెంట్లు చేశారు. ఒకవేళ పరిగణనలోకి తీసుకొని ఉండి.. నరైన్‌ ఔట్‌ ఉంటే దిల్లీ పరిస్థితి విభిన్నంగా ఉండేదేమో. ఎందుకంటే, అప్పటికి నరైన్ స్కోరు 24 మాత్రమే. చివరికి 39 బంతుల్లో 85 పరుగులు చేసిన కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని