Rohit Sharma: తొలి మ్యాచ్‌ నాటికి.. మేం చేయాల్సిందదే: రోహిత్

వరల్డ్‌ కప్‌లో తమ సన్నద్ధతపై భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శనివారం వార్మప్‌ మ్యాచ్‌ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడాడు.

Updated : 31 May 2024 15:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అన్ని అస్త్రాలతో టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. వాటిని పరీక్షించుకొనేందుకు శనివారం బంగ్లాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అసలైన సంగ్రామంలో మాత్రం జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో తమ సన్నద్ధతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీతో సంభాషించాడు. వార్మప్‌ మ్యాచ్‌ కూడా తమకు చాలా ముఖ్యమని.. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు దీన్ని సద్వినియోగం చేసుకుంటామని వ్యాఖ్యానించాడు.

‘‘టోర్నీ ప్రారంభానికి ముందే ఇక్కడి పిచ్‌, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంది. ఇంతకుముందెన్నడూ ఇక్కడ ఆడలేదు. అందుకే మాకు వార్మప్ మ్యాచ్‌ అత్యంత కీలకం. బ్యాటర్లు, బౌలర్లు తమ లయను అందిపుచ్చుకోవడానికి వీలుంది. జూన్ 5న మేం తొలి మ్యాచ్‌ ఆడనున్నాం. దానికి సన్నాహకంగా ఈ వార్మప్‌లను వాడుకుంటాం. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాక.. న్యూయార్క్ అందాలను వీక్షించే అవకాశం వచ్చింది. వేదిక కూడా చాలా బాగుంది. ఓపెన్‌ గ్రౌండ్‌. ఇలాంటి మైదానంలో ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. తప్పకుండా భారీఎత్తున అభిమానులు క్రికెట్‌ మ్యాచ్‌లను చూసేందుకు వస్తారని ఆశిస్తున్నా’’ అని రోహిత్ తెలిపాడు. 

యూఎస్‌ఏ చేతిలో ఓటమితో బంగ్లా.. 

భారీ టోర్నీకి ముందు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో యూఎస్‌ఏ చేతిలో బంగ్లాకు ఓటమి ఎదురైంది. వాటన్నింటిని మరిచి పొట్టి కప్‌ బరిలోకి దిగుతామని బంగ్లా సారథి నజ్ముల్ షాంటో వెల్లడించాడు. ‘‘టీ20 ప్రపంచ కప్‌ ముందు మేం ఇలాంటి ఓటమిని ఊహించలేదు. ఇక ఇప్పుడు ఈ వికెట్‌ ఎలా ఉంటుంది? పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది సోషల్ మీడియాలో చూశాం. వార్మప్‌ మ్యాచ్‌లో ఎలా రాణిస్తామనేది ఉత్కంఠ రేపుతోంది’’ అని నజ్ముల్ పేర్కొన్నాడు. 

ఎక్కడ చూడొచ్చు..?

ఈ వరల్డ్‌ కప్‌లో కేవలం రెండు వార్మప్‌ మ్యాచ్‌లు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఒకటి భారత్ - బంగ్లాదేశ్‌ వార్మప్ మ్యాచ్‌, మరొకటి విండీస్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌. భారత్-బంగ్లా మ్యాచ్‌ శనివారం రాత్రి 8 గంటలకు జరగనుంది.  స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించొచ్చు. డిస్నీ - హాట్‌స్టార్‌ ఓటీటీలో చూసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని