IND vs PAK: ప్రతి పరుగూ విలువైందని తెలుసు... కానీ: రోహిత్ శర్మ

న్యూయార్క్‌ పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని మరోసారి రుజువైంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది.

Published : 10 Jun 2024 08:28 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో (T20 World Cup 2024) పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం మరోసారి నిరూపితమైంది. ఇప్పటి వరకు ఆరుసార్లు విజేతగా నిలవగా.. దానిని ఇప్పుడు ఏడుకు పెంచుకుంటూ న్యూయార్క్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (IND vs PAK) అద్భుత విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన పోరులో భారత బౌలర్లు సంచలన బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలుత బ్యాటింగ్‌లో తాము అనుకున్నంత మేర రాణించలేకపోయామని.. గత మ్యాచులో ఆడిన పిచ్‌తో పోలిస్తే ఇది ఫర్వాలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. 

‘‘పాక్‌కు మేం అనుకున్నంత మేర లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయాం. మా బ్యాటింగ్‌ తొలి అర్ధభాగంలో మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ.. త్వరగా వికెట్లను కోల్పోవడం నష్టం చేసింది. సరైన భాగస్వామ్యాలను నిర్మించలేదు. ఇక్కడ ప్రతి పరుగూ అత్యంత కీలకం. గతంతో పోలిస్తే ఈసారి పిచ్‌ చాలా బాగుంది. ఈ లక్ష్యం సరిపోతుందని భావించాం. మా బౌలింగ్‌ లైనప్‌పై నమ్మకం ఉంది. పాక్‌ బ్యాటింగ్‌ను చూసిన తర్వాత కూడా మ్యాచ్‌ చేజారుతుందని అస్సలు అనుకోలేదు. ఈ ఒక్క వికెట్‌ తీస్తే చాలు మనం రేసులో ఉన్నట్లేనని అనుకున్నాం. ప్రతి బౌలర్‌ తమ పాత్రను చక్కగా పోషించారు. బుమ్రా ప్రతి మ్యాచ్‌కూ బలంగా మారుతున్నాడు. తప్పకుండా జట్టును గెలిపిస్తాడని తెలుసు. అతడి గురించి మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ స్పెషలే. వరల్డ్ కప్ ఆసాంతం అతడు ఇదే మైండ్‌సెట్‌తో ఉంటే చాలు. న్యూయార్క్‌ ప్రేక్షకులు మద్దతు అనిర్వచనీయం. మా ఆటను ఆస్వాదించి ఉంటారని అనుకుంటున్నా’’ అని రోహిత్ తెలిపాడు. 

బ్యాటింగ్‌లోనే ఇబ్బంది పడ్డాం: బాబర్

‘‘మా బౌలర్లు పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అదరగొట్టారు. బ్యాటింగ్‌లోనే ఇబ్బంది పడ్డాం. వరుసగా వికెట్లను కోల్పోవడమూ నష్టం చేసింది. ఎక్కువ డాట్‌ బాల్స్‌గా వదిలేశాం. స్ట్రైక్‌ను రొటేట్ చేయడంలో విఫలమయ్యాం. పిచ్‌ను తప్పుబట్టేందుకు ఏంలేదు.  మేం ఎక్కడ పొరపాట్లు చేశామనేది చర్చించుకుని మిగతా మ్యాచుల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని బాబర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని