Rohit Sharma: అందుకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగా: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (52) అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అందుకు గల కారణాన్ని మ్యాచ్‌ అనంతరం రోహిత్ వివరించాడు. 

Updated : 06 Jun 2024 06:58 IST

న్యూ యార్క్: టీ20 ప్రపంచకప్‌ 2024 (T20 World Cup)లో భారత్ శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఐర్లాండ్ 96 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమ్ఇండియా 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) (52; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం బాది రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రిషభ్‌ పంత్ (36*; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హాఫ్‌ సెంచరీ కాగానే రోహిత్ 10వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో రోహిత్‌కు ఏమైంది అని టీమ్ఇండియా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ దీనిపై వివరణ ఇచ్చాడు. భుజం కాస్త నొప్పిగా ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగానని చెప్పాడు.

‘‘భుజం కొంచెం నొప్పిగా ఉంది. అందుకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగా. పిచ్‌ ఎలా స్పందిస్తుందనే విషయం కచ్చితంగా తెలియదు. టాస్‌ సందర్భంగానూ ఇదే విషయం చెప్పా. కొత్త స్టేడియంలో ఐదు నెలల కిందట తయారు చేసిన ఈ పిచ్‌పై ఎలా ఆడాలో తెలియదు. పిచ్‌ పరిస్థితులను తెలుసుకోవడం కోసం సెకండ్ బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్‌ బౌలర్లకు అనుకూలించింది. క్రీజులో నిలదొక్కుకుంటే ఇక్కడ పరుగులు రాబట్టొచ్చు. ఈ మైదానంలో నలుగురు స్పిన్నర్లతో ఆడాలనుకోవద్దు. మా తుది జట్టు ఎంపిక బ్యాలెన్సింగ్‌గా ఉండాలనుకుంటున్నాం. పరిస్థితులు సీమర్లకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తుందనుకుంటే మరో విధంగా జట్టు ఎంపిక ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లు, ఆల్‌ రౌండర్లుగా ఉన్న ఇద్దరు స్పిన్నర్లను మేం తుది జట్టులోకి తీసుకున్నాం. నాణ్యమైన పేస్ దళం ఉన్న పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి మేం సన్నద్ధమవుతాం’’ అని రోహిత్ శర్మ వివరించాడు.

కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో భారత్‌కు అత్యధిక (43) విజయాలు అందించిన సారథిగా చరిత్ర సృష్టించాడు. ధోనీ (41), విరాట్ కోహ్లీ (30) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని