Rohit Sharma: ఐపీఎల్‌లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ

ఐపీఎల్‌లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. 

Published : 18 Apr 2024 18:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను 2023 నుంచి అమలుచేస్తున్నారు. ఈ నిబంధన వల్ల ప్రతీ జట్టు మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఆడించుకోవచ్చు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్‌ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్‌ ఆటగాడిగా తీసుకోవచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్‌ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్‌ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్‌ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్‌ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. ఈ నిబంధన వల్ల చాలా జట్లు ప్రయోజనం పొందుతున్నాయి కూడా. అయితే, ఈ రూల్‌పై ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల శివమ్‌ దూబె, వాషింగ్టన్ సుందర్‌ వంటి ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని, ఇది భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.  

‘ఆల్‌రౌండర్ల అభివృద్ధికి ఈ రూల్ అడ్డంకిగా మారుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే  క్రికెట్‌ను ఆడించాల్సింది 11 మంది ఆటగాళ్లతో. 12 మందితో కాదు. నాకు ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌ అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం ఇలా చేస్తున్నారు. కానీ, క్రికెట్ కోణంలో పరిశీలిస్తే…. నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పగలను. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె వంటి వారు బౌలింగ్ చేయడం లేదు. ఇది మాకు (భారత జట్టు) మంచిది కాదు’ అని రోహిత్ శర్మ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నాడు. ఈ సీజన్‌లో ముంబయి పేలవమైన ఆరంభం చేయడంపైనా రోహిత్ స్పందించాడు. ‘‘ఇన్నేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ముంబయికి ఇలాంటి పరిస్థితి కొత్త కాదు. ఈ సీజన్‌లో పేలవంగా ఆరంభించాం. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని భావిస్తున్నా’’  హిట్‌మ్యాన్‌ అని పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని