Rohit on World Cup 2011: ఆ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను చూడొద్దనుకున్నా.. కానీ: రోహిత్

పన్నెండేళ్ల కిందట భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ను (ODI World Cup) భారత్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి స్వదేశంలో మెగా టోర్నీ జరగనుడటంతో టీమ్‌ఇండియాపై (Team India) భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే, తాము విజేతగా నిలిచేందుకు చెబుతూనే.. 2011 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 08 Aug 2023 11:59 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ రెండో వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన 2011వ (Odi World Cup 2011) ఏడాదిని ఎవరూ మరిచిపోలేరు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో యువకుడైన రోహిత్ శర్మకు (Rohit Sharma) ఆ మెగా టోర్నీలో ఆడే అవకాశం రాలేదు. అతడి కంటే అంతర్జాతీయ క్రికెట్‌ను వెనుక ప్రారంభించిన విరాట్ కోహ్లీకి (Virat Kohli) మాత్రం జట్టులో చోటు దక్కింది. దీంతో అసంతృప్తితో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను చూడకూడదని రోహిత్ భావించాడట. అయితే, భారత్‌ అద్భుతంగా ఆడటంతో ప్రతి మ్యాచ్‌నూ వదలకుండా వీక్షించినట్లు గుర్తు చేసుకున్నాడు. అమెరికాలో ఐసీసీ ప్రపంచకప్‌ ప్రచార కార్యక్రమంలో రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘2011 వరల్డ్‌ కప్‌ నాతో సహా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇంట్లో నుంచే మ్యాచ్‌లను వీక్షించా. అయితే, అప్పుడు నేను రెండు రకాలుగా భావోద్వేగానికి గురయ్యా. నేను జట్టులో లేను. చాలా నిరుత్సాహానికి గురయ్యా. దాంతో తొలుత వరల్డ్‌ కప్‌ను చూడకూడదని బలంగా అనుకున్నా. కానీ, టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడింది.  మరీ ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్‌ నుంచి దూకుడుగా ఆడింది. సెమీస్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఎంజాయ్ చేశా. తీవ్ర ఒత్తిడి ఉండే ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడం ఎప్పటికీ మరిచిపోలేను. చివరికి భారత్‌ విజేతగా నిలవడం ఓ అద్భుతం. 

ఆసీస్‌ జట్టులో ట్యాక్సీ డ్రైవర్‌ తనయుడు

నేను 2011 వరల్డ్‌ కప్‌లో ఆడలేకపోయా. అయితే, ఆ తర్వాత జరిగిన 2015, 2019 ప్రపంచకప్‌లో బరిలోకి దిగా. రెండుసార్లూ సెమీస్‌కు చేరుకున్నాం. ప్రతి ఒక్కరం జట్టును ఫైనల్‌కు చేర్చి విజేతగా నిలిపేందుకు ప్రయత్నించాం. దురదృష్టవశాత్తూ సాధ్యంకాలేదు. ఇప్పుడు మళ్లీ స్వదేశంలో వన్డే వరల్డ్‌ కప్‌ ఆడబోతున్నాం. విజేతగా నిలిచేందుకు మావంతు కృషి చేస్తాం. ఒకటీ రెండు రోజుల్లో వరల్డ్‌ కప్‌ను గెలవలేం. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించాలి. జట్టుగా మేం వరల్డ్‌ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం’’ అని రోహిత్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని