Rohit Sharma: కెమెరామన్‌.. ప్లీజ్‌ ఆడియో ఆన్‌ చేయొద్దు: రోహిత్ శర్మ

లఖ్‌నవూతో మ్యాచ్‌ సందర్భంగా ముంబయి స్టార్‌ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్‌గా మారిపోయింది.

Updated : 18 May 2024 10:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి చివరి మ్యాచ్‌ ఆడేసింది. లఖ్‌నవూతో జరిగిన పోరులో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇందులో లఖ్‌నవూ గెలిచినా ఇంటిముఖం పట్టక తప్పలేదు. లఖ్‌నవూ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 196/6 స్కోరుకే పరిమితమైంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ (Rohit Sharma) 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అయితే, మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు ధవళ్ కులకర్ణితో మాట్లాడుతూ రోహిత్ కనిపించాడు. ఈ క్రమంలో కెమెరామెన్‌ వీడియో తీయడాన్ని గమనించాడు.

ఇప్పటికే కోల్‌కతా కోచ్ అభిషేక్ నాయర్‌తో సంభాషణ వైరల్‌గా మారిన సంగతి గుర్తుకొచ్చి.. సదరు కెమెరామన్‌కు రోహిత్ సరదాగా ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘బ్రదర్‌ ప్లీజ్‌ ఆడియోను క్లోజ్‌ చేయి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. 

హార్దిక్‌పై ఒక మ్యాచ్‌ వేటు!

చివరి మ్యాచ్‌లోనూ ఓటమితో సీజన్‌ను ముగించిన ముంబయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. లఖ్‌నవూ చేతిలో ఓడిన ఆ జట్టుకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ షాక్‌ ఇచ్చింది. మినిమమ్‌ ఓవర్‌ రేట్‌ను ఉల్లంఘించినందుకు కెప్టెన్ హార్దిక్‌ పాండ్యపై (Hardik Pandya) ఒక మ్యాచ్‌ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌ సస్పెన్షన్‌తోపాటు రూ. 30 లక్షల జరిమానాను విధించింది. తుది జట్టులోని ఇతర ఆటగాళ్లకూ రూ. 12 లక్షలు లేదా 50 శాతం ఏది తక్కువైతే దానిని ఫైన్‌ విధిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.  ‘‘సమయంలోగా ఓవర్లను పూర్తి చేయడంలో కెప్టెన్‌ హార్దిక్‌ విఫలమయ్యాడు. ఇది ఆ జట్టు చేసిన మూడో తప్పిదం. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక మ్యాచ్‌ వేటుతోపాటు భారీ మొత్తాన్ని జరిమానాగా విధించాం. జట్టులోని సహచరులకూ ఫైన్‌ వేశాం’’ అని కమిటీ ప్రకటన జారీ చేసింది. ఇప్పుడీ నిర్ణయంతో వచ్చే సీజన్‌లో పాండ్య ఆడే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు