Rohit Sharma: రుతురాజ్‌ తాత్కాలికమే.. రోహిత్ వచ్చేస్తాడు: చెన్నై కెప్టెన్సీపై మైకెల్ వాన్

ఐపీఎల్‌లో ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన సారథి రోహిత్ శర్మ. అలాంటి అతడి స్థానంలో ముంబయి మేనేజ్‌మెంట్ హార్దిక్‌ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. 

Published : 13 Apr 2024 16:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ముంబయి సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి హార్దిక్‌ పాండ్యకు అప్పగించడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. ముంబయి మ్యాచుల సందర్భంగా అభిమానులు కూడా రోహితే మళ్లీ కెప్టెన్సీ చేపట్టాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు క్రికెట్ విశ్లేషకులకు మాత్రం రోహిత్‌ను ఈ సీజన్‌ తర్వాత ముంబయి రిటైన్‌ చేసుకోదని చెబుతున్నారు. మెగా వేలంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువేనని.. ఆలోపే మరో జట్టు తీసుకొనేందుకూ ఛాన్స్‌ ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు. చెన్నై లేదా లఖ్‌నవూ రోహిత్‌ను తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ వచ్చింది. తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా రోహిత్ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్తున్నాడా? ధోనీని (MS Dhoni) రీప్లేస్‌ చేస్తాడా? రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) ఈ ఏడాది మాత్రమే కెప్టెన్సీ నిర్వర్తిస్తాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సారథ్య బాధ్యతలను రోహిత్‌కు అప్పగిస్తారు. అతడిని చెన్నైలో చూస్తానని అనుకుంటున్నా. ఇదే జరిగితే ముంబయి అభిమానులకు గుండె పగిలే న్యూస్ అవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో డెక్కన్ ఛార్జర్స్‌కు అతడు ఆడాడు. 

ముంబయి జట్టుకు రావడంతో హార్దిక్‌కు (Hardik Pandya) కష్టకాలం మొదలైంది. ఇందులో అతడి తప్పులేదు. ముంబయి కెప్టెన్సీ బాధ్యతలను అడిగి తీసుకున్నాడు. ప్రతీ భారత క్రికెటర్‌ ముంబయి వంటి జట్టుకు సారథ్యం చేయాలని కోరుకుంటాడు. గత కొన్నేళ్లుగా ముంబయి జట్టులో సరైన కమ్యూనికేషన్‌ లేదని అర్థమవుతోంది. వ్యక్తిగతంగా నేను రోహిత్‌ కెప్టెన్సీకే మొగ్గు చూపుతా. హార్దిక్‌ తిరిగి రావడం ఒత్తిడికి గురి చేసే అంశమే. వచ్చే వరల్డ్‌ కప్‌లో భారత టీ20 జట్టును నడిపించేది రోహితే. కాబట్టి, హార్దిక్‌ జాతీయజట్టు స్థానాన్ని దృష్టిలోపెట్టుకొనైనా రోహిత్‌ను ముంబయికి మళ్లీ కెప్టెన్‌ చేస్తే బాగుంటుంది. అలా చేయకపోతే రోహిత్‌ను చేజార్చుకున్నట్లే’’ అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని