Chennai Vs Lucknow: 14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్‌

చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ సెంచరీతో అలరించినా.. లఖ్‌నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్‌ స్టాయినిస్‌ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు.

Published : 24 Apr 2024 10:31 IST

ఇంటర్నెట్ డెస్క్: చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై లఖ్‌నవూ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 210/4 స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లఖ్‌నవూ గెలిచింది. సగానికిపైగా మ్యాచ్‌లో పైచేయి సాధించినా.. చివర్లో తమ జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం మంచు ప్రభావమని చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అన్నాడు.

‘‘లఖ్‌నవూ బాగా ఆడింది. మ్యాచ్‌లో మేం 14వ ఓవర్‌ వరకూ ఆధిక్యంలోనే ఉన్నాం. స్టాయినిస్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ మాకు దూరమైంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో స్పిన్నర్లకు పట్టు దొరకలేదు. చివరి వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లినా ఓటమి తప్పలేదు. మన చేతుల్లో లేని వాటిని నియంత్రించడం చాలా కష్టం. బ్యాటింగ్‌ విభాగంతో ఏమాత్రం ఇబ్బంది లేదు. పవర్‌ ప్లేలో వికెట్‌ పడితే శివమ్‌ దూబె క్రీజ్‌లోకి వస్తాడు. ఈ తర్వాత జడేజా ఆడతాడు. ముందు నుంచే ఇలా ప్రణాళిక చేసుకున్నాం. ఈ వికెట్‌ మీద అనుకున్నదానికంటే ఎక్కువే స్కోరు చేశాం. పరిస్థితులు మాకు కలిసిరాలేదు’’ అని రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు. 

మొదట్లో వెనుకబడ్డాం: కేఎల్ రాహుల్

‘‘భారీ టార్గెట్‌ను చెన్నై సొంతమైదానంలో ఛేదించడం సాధారణ విషయం కాదు. ఒకదశలో మేం చాలా వెనుకబడ్డాం. మా బ్యాటర్లు మమ్మల్ని గెలిపించారు. స్టాయినిస్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ పిచ్‌పై 180 పరుగులు చేసినా మంచి స్కోరే అవుతుంది. చెన్నై బ్యాటర్లు 200+ చేసి మాపై ఒత్తిడి తెచ్చారు. స్టాయినిస్‌ చాలా తెలివిగా ఒక్కో బౌలర్‌ను ఎంచుకుని ఎదురు దాడి చేశాడు. టాప్‌ - 3 బ్యాటర్లలో తప్పకుండా ఒకరు పవర్‌ హిట్టర్ ఉండాలి. ఇంపాక్ట్‌ రూల్ వల్ల అదనంగా బ్యాటింగ్‌ విభాగం ఇంకాస్త బలంగా మారింది’’ అని లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు