Gambhir - Shah Rukh Khan: పదేళ్లపాటు ఉండేలా.. గంభీర్‌కు ‘బ్లాంక్‌ చెక్’ ఆఫరిచ్చిన షారుక్‌ ఖాన్‌!

ఐపీఎల్ 17వ సీజన్‌ టైటిల్‌ను కోల్‌కతా నెగ్గడంతో.. ఆ జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. కెప్టెన్ శ్రేయస్‌ అయినా వెనకుండి నడిపించిన ఘనత మాత్రం గౌతీదే.

Published : 27 May 2024 14:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం ఎవరు దరఖాస్తు చేశారో అధికారికంగా తెలియదు. కానీ, ఈ రేసులో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) ముందున్నాడనేది సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న వార్త. తాజాగా ఐపీఎల్‌ ఫైనల్‌ అనంతరం గంభీర్‌తో జైషా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు దీనికి బలాన్ని చేకూర్చాయి. గంభీర్‌ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్న మాట. కానీ, ఇక్కడే ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం గంభీర్‌ కోల్‌కతా మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు లఖ్‌నవూ జట్టుకు ఇదే బాధ్యతలు నిర్వర్తించాడు. అతడిని మళ్లీ కేకేఆర్‌కు తీసుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుక్ ఖాన్ చాలా శ్రమించాడని.. దాని కోసం గంభీర్‌కు ‘బ్లాంక్ చెక్‌’ ఆఫర్ చేశాడని తెలుస్తోంది. తన జట్టుతో పదేళ్లపాటు ఉండాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఎలాంటి ఫలితం వచ్చినా ఇబ్బందిలేదు. జట్టును ఎలా నడిపిస్తావు అనేది నీ ఇష్టం’ అని కూడా షారుక్ చెప్పినట్లు క్రికెట్‌ వర్గాల్లో టాక్. ఇప్పుడు ఇదే భారత జట్టు కోచ్‌ పదవికి అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు. షారుక్ ఖాన్‌తో కూడా బీసీసీఐ ప్రతినిధులు చర్చించి... గంభీర్‌ను పంపించడానికి ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలనేది క్రికెట్ పండితుల అభిప్రాయం. 

విజేతగా నిలిచిన అనంతరం.. 

మూడోసారి విజేతగా నిలిచిన తర్వాత కోల్‌కతా ఆటగాళ్ల సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ సందర్భంగా ఆటగాళ్లను హగ్‌ చేసుకుని ఫ్రాంచైజీ ఓనర్ షారుక్ ఖాన్ అభినందనలు తెలిపాడు.  మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ను కూడా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. గత రెండు సీజన్లలో కేకేఆర్ ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఛాంపియన్‌గా అవతరించడంలో గౌతమ్ గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని