T20 World Cup 2024: యువీ - క్రిస్‌ గేల్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా మరో స్టార్‌

వరల్డ్ కప్‌ కోసం పాకిస్థాన్‌కు చెందిన మరో స్టార్‌ అంబాసిడర్‌గా వచ్చాడు. ఇప్పటికే యువరాజ్‌ సింగ్‌, క్రిస్‌ గేల్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 24 May 2024 17:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని టీ20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. యూఎస్ఏ - విండీస్ సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది.  2009 టైటిల్‌ను పాక్‌ నెగ్గడంలో అఫ్రిది కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు 2007 ఎడిషన్‌లోనూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్’ను సొంతం చేసుకున్నాడు. దీంతో అతడిని పొట్టి కప్ రాయబారిగా ఐసీసీ నియమించింది. ఇప్పటికే భారత స్టార్‌ యువరాజ్‌ సింగ్‌, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనకు అవకాశం ఇచ్చిన ఐసీసీకి ధన్యవాదాలు చెబుతూనే.. దాయాదుల పోరు కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు. 

‘‘ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ వంటి మెగా ఈవెంట్ నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. మొదటి ఎడిషన్‌లోనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచా. ఆ తర్వాత 2009 టైటిల్‌ను సాధించాం. నా కెరీర్‌లో అత్యుత్తమ పోటీ ఇచ్చిన స్టేజ్‌ల్లో ఇదొకటి. టీ20 ప్రపంచకప్‌లు జరిగే కొద్దీ మరింత శక్తిమంతంగా తయారవుతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇలా అంబాసిడర్‌గా భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈసారి మరిన్ని జట్ల ప్రదర్శనను చూడబోతున్నాం. మరింత డ్రామా కూడా ఉంటుందని భావిస్తున్నా. 

నేనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేచి చూసే రోజు జూన్ 9. భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దాయాదుల పోరును చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. రెండు గొప్ప జట్ల మధ్య మరోసారి రసవత్తరమైన పోరు ఉంటుందని అనుకుంటున్నా’’ అని అఫ్రిది తెలిపాడు. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ మొత్తం టీ20 వరల్డ్‌కప్‌ల్లో 34 మ్యాచులు ఆడాడు. 546 పరుగులు చేయడంతోపాటు 39 వికెట్లు తీశాడు. ఇందులో రెండుసార్లు 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. 2009 ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు