Hardik Pandya: ‘ధోనీ ఎప్పటికీ ధోనీనే’.. హార్దిక్‌ ముంబయి కెప్టెన్సీపై షమి కీలక వ్యాఖ్యలు

ముంబయి కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తీసుకున్న నిర్ణయాలపై అభిమానులతోపాటు కొంతమంది ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత పేసర్ షమి కూడా పాండ్య కెప్టెన్సీపై విమర్శలు చేశాడు. 

Published : 26 Mar 2024 00:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఓటమి పాలైంది. తొలుత గెలిచేలా కనిపించిన ముంబయి.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తీసుకున్న పలు నిర్ణయాలపై అభిమానులతోపాటు, కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత పేసర్‌ మహ్మద్‌ షమి (Mohammed Shami) కూడా హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ మూడు, నాలుగు స్థానాల్లో కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని తప్పుబట్టాడు. ప్రతి కెప్టెన్‌ మైండ్‌సెట్ భిన్నంగా ఉంటుందని, ధోనీలా ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదన్నాడు. షమి గత రెండు సీజన్లలో హార్దిక్‌ నాయకత్వంలోనే గుజరాత్ తరఫున ఆడాడు. హార్దిక్ తిరిగి ముంబయి జట్టులో చేరి కెప్టెన్‌ అయిన సంగతి తెలిసిందే.

‘‘ధోనీ ఎప్పటికీ ధోనీనే. అతనికి ఎవరూ సరితూగరు. ప్రతి ఒక్కరికి భిన్నమైన మనస్తత్వం ఉంటుంది. ధోనీ అయినా కోహ్లీ అయినా అందరి ఆలోచనా ధోరణి వేరు. మీ నైపుణ్యాన్ని బట్టి మీరు ఆటలో కొనసాగాలి. గత రెండు సీజన్లలో గుజరాత్ తరఫున హార్దిక్‌ పాండ్య మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. కెరీర్‌లో చాలాసార్లు ఐదో స్థానంలో కూడా ఆడారు. మరి ఇప్పుడు ముంబయి తరఫున ఏడో స్థానంలో ఎందుకు వచ్చాడు? ఇలా చేయడం వల్ల హార్దిక్ దాదాపు టెయిలెండర్‌లాగా కనిపిస్తున్నాడు. ఏడో స్థానంలో వస్తే మీపై మీరే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుంది. ఒకవేళ పాండ్య ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్‌ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు’’ అని షమి వ్యాఖ్యానించాడు. ఇటీవల చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో ఐపీఎల్ 17 సీజన్‌కు దూరమయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని