Shikhar Dhawan: ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్‌

గాయం నుంచి కోలుకుని ముంబయితో మ్యాచ్‌కు శిఖర్ ధావన్‌ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిపై పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

Published : 17 Apr 2024 16:46 IST

ఇంటర్నెట్ డెస్క్: తనకు దూరంగా ఉంటున్న కుమారుడిని గుర్తు చేసుకుని పంజాబ్‌ కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన కొడుకు జొరావర్‌ను చూసి ఏడాది అవుతుందంటూ కొన్ని నెలల కిందట పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జొరావర్ పేరుతో ఉన్న జెర్సీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పంజాబ్ జెర్సీపై ‘1’ నంబర్‌ వేయించిన అతడు దాన్ని ధరించిన ఫొటో కూడా షేర్ చేసుకున్నాడు. ‘‘మై బాయ్.. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు’’ అని రాసుకొచ్చాడు. గాయం కారణంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన ధావన్ కోలుకుంటున్నాడు. గురువారం ముంబయితో ముల్లాన్‌పుర్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.

ఆరు నెలల కిందట పోస్టు ఇలా..

ఆరు నెలల కిందట తన కుమారుడిని చూపించడానికి కూడా మాజీ భార్య ఇష్టపడటం లేదని ధావన్‌ విమర్శిస్తూ పోస్టు చేశాడు. ‘‘నిన్ను నేరుగా చూసి ఏడాది దాటింది. నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా అన్నివిధాలుగా నన్ను బ్లాక్‌ చేస్తున్నారు. కానీ, నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ.. టెలీపతితో ఎప్పటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని నాకు తెలుసు. దేవుడి దయ వల్ల మళ్లీ మనం కలుస్తామని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండు’’ అంటూ రాసుకొచ్చాడు.

ధావన్‌, తన భార్య అయేషా ముఖర్జీ (Ayesha Mukherjee)కి కోర్టు గతేడాది విడాకులు మంజూరుచేసిన విషయం తెలిసిందే. అయితే, తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్‌ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కానీ, ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతించింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉండగా.. ఆ మధ్య శిఖర్‌ తన కుమారుడితో వీడియోకాల్‌లో మాట్లాడిన ఫొటోను పోస్ట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని