Shubman Gill on Harmanpreet Kaur: అప్పుడు మా అకాడమీ బౌలర్లపై విరుచుకుపడింది: హర్మన్‌ప్రీత్‌ బ్యాటింగ్‌పై గిల్

Eenadu icon
By Sports News Team Published : 20 Sep 2025 00:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బ్యాటింగ్‌ను తాను చిన్నప్పుడే ప్రత్యక్షంగా చూశానని టెస్టు జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ తెలిపాడు. తమ అకాడమీ బౌలర్లపై ఆమె ఆధిపత్యం ప్రదర్శించారని గుర్తు చేసుకున్నాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న (సెప్టెంబర్ 30 నుంచి) మహిళల వన్డే ప్రపంచ కప్‌ (Womens ODI World Cup 2025)లో హర్మన్ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. ప్రస్తుతం హర్మన్‌ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడుతుండగా.. శుభ్‌మన్‌ గిల్ ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. తాజాగా జియో హాట్‌స్టార్‌ స్పెషల్ కార్యక్రమంలో గిల్ పాల్గొన్నాడు. ఇదే కార్యక్రమంలో జెమీమా రోడ్రిగ్స్‌పై సూర్య కుమార్‌ యాదవ్, రిచా ఘోష్‌ బ్యాటింగ్‌పై సంజు శాంసన్ స్పందించారు. హార్దిక్‌ పాండ్య కూడా భారత మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.

‘‘నాకు అప్పుడు 10, 11ఏళ్లు ఉంటాయి. ఆమె మా అకాడమీకి ప్రాక్టీస్‌ కోసం వచ్చింది. మాతోనూ మ్యాచులు ఆడింది. నాకు ఇప్పటికీ గుర్తు. మా అకాడమీ బౌలర్లపై విరుచుకుపడింది. పిల్లాడిగా అలాంటి బ్యాటింగ్‌ చూడటం చాలా అరుదు. ఇప్పుడు కాస్త నెమ్మదిగా ఆడుతోంది. కానీ, అప్పుడైతే చాలా దూకుడు. హర్మన్ ప్రీత్‌ ఇప్పుడు నాయకురాలు. పంజాబ్ నుంచి ఎవరు ఏ స్థానానికి వెళ్లినా గౌరవంగా భావిస్తాం. దేశానికి నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదు’’ అని గిల్ (Shubman Gill) వెల్లడించాడు.

జెమీమా కీలక పాత్ర: సూర్యకుమార్

‘‘హోం సిటీ నుంచి ఎవరైనా వస్తే ఆ ఆనందమే వేరు. ముంబయి నుంచి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ భారత్‌ జట్టులో ఆడటం అద్భుతం. ద్వైపాక్షిక సిరీసుల్లోనూ మంచి ప్రదర్శన చేసే రోడ్రిగ్స్‌ వరల్డ్‌ కప్‌లో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా. ప్రపంచ కప్‌లో ఆడటమనేది గొప్ప అవకాశం. తప్పకుండా రోడ్రిగ్స్‌ నుంచి అద్భుత ప్రదర్శనలు ఆశించొచ్చు. జట్టుకు విలువ తీసుకొస్తుదనడంలో సందేహం లేదు’’ అని సూర్యకుమార్‌ (SuryaKumar Yadav) తెలిపాడు.

రిచా ఘోష్‌ ఆట బాగుంది: సంజు

‘‘రిచా ఘోష్ ఆటను చూడటం నాకు ఇష్టం. వికెట్ల వెనుక చురుగ్గా ఉంటుంది. బ్యాటింగ్‌లోనూ దూకుడు అద్భుతం. నిశ్శబ్దంగా ఉంటూ తన పని చేసుకుపోతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఆడుతుంది. భారత జెర్సీ ధరించడం తేలికేం కాదు. అందుకోసం బాగా శ్రమించాలి. ఆ కష్టాలను దాటుకొని ఇక్కడ వరకూ వచ్చింది’’ అని సంజు శాంసన్ (Sanju Samson) వ్యాఖ్యానించాడు. దేశప్రజలంతా మహిళా జట్టుకు అండగా ఉంటుందని.. కప్‌ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని