Shubman Gill: కెప్టెన్‌గా తొలిసారి గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా.. పునరావృతమైతే ఒక మ్యాచ్‌ వేటు!

గుజరాత్‌ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) జరిమానా ఎదుర్కొన్నాడు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.,

Published : 27 Mar 2024 13:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో మొదటిసారి శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) కెప్టెన్సీ చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లోనే ముంబయిపై విజయం సాధించి గుజరాత్‌ బోణీ కొట్టింది. చెపాక్‌ వేదికగా చెన్నైతో జరిగిన తన రెండో మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు చేతిలో 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా గిల్‌పై రూ.12 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ ప్రకటన చేసింది. ఇదే సీజన్‌లో మరోసారి ఇలా చేస్తే ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 

షమీని రిప్లేస్‌ చేయడం కష్టమే: మోహిత్ శర్మ

గుజరాత్‌ జట్టుకు కీలక బౌలర్‌ షమీ (Shami) లేకపోవడం లోటేనని.. ఆ ప్లేస్‌ను భర్తీ చేయడం చాలా కష్టమని మోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. చెన్నైతో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి జట్టుకైనా షమీలాంటి బౌలర్‌ పెద్ద బలం. అతడి లేని లోటును పూడ్చలేం. గాయాలను నియంత్రించడం చాలా కష్టం. వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్‌, ఒమర్జాయ్‌కు గుజరాత్‌ తరఫున ఇదే తొలి సీజన్. వారిద్దరూ కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. వారి నుంచి సత్వరమే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదు. విజయాలు ముఖ్యమే. కానీ, మన ప్రణాళికలను చక్కగా అమలు చేస్తున్నామా? లేదా? అనేది కీలకం. గతంలో నేను చెన్నై తరఫున ఆడేటప్పుడు ఎలాంటి వ్యూహాలను అమలు చేసిందో.. ఇప్పుడూ అలానే ఆడుతోంది. పవర్‌ ప్లేలో పరుగులు రాబడితే ఎలాంటి జట్టుకైనా సానుకూలాంశమే’’ అని మోహిత్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని