Sikandar Raza: మహామహులకు సాధ్యం కాలేదు.. టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జింబాబ్వే కెప్టెన్‌

అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా (Sikandar Raza) తన ఖాతాలో వేసుకున్నాడు. 

Updated : 16 Jan 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో మహామహులకు సాధ్యం కాని రికార్డును జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా (Sikandar Raza) నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆదివారం కొలంబోలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో (62; 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాది ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. సికిందర్ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 58, 65, 82, 65, 62 స్కోర్లు చేశాడు.

2024 టీ20 ప్రపంచకప్ కోసం గతేడాది నవంబర్‌లో ఐసీసీ ఆఫ్రికా రీజియన్‌ క్వాలిఫయర్‌ను నిర్వహించింది. ఇందులో సికిందర్‌ రజా రువాండా (58), నైజీరియా (65), కెన్యా (82)పై అర్ధ సెంచరీలు చేశాడు. అనంతరం స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు చేశాడు. తాజాగా లంకపై అర్ధ శతకం చేసి అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్), క్రిస్‌ గేల్ (వెస్టిండీస్), క్రెయిగ్ విలియమ్స్‌ (నమీబియా), రేయాన్ పఠాన్ (బెర్ముడా), గుస్తావ్ మెకియోన్ (ఫ్రాన్స్‌), రిజా హెండ్రిక్స్‌ (దక్షిణాఫ్రికా) టీ20ల్లో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు బాదారు. తాజాగా వీరిని సికిందర్‌ రజా అధిగమించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని