T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్‌ వీళ్లే..!

T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్‌ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు.

Updated : 23 Apr 2024 13:16 IST

T20 World Cup | దిల్లీ: టీ20 క్రికెట్లో టీమిండియా ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దిల్లీ ఐపీఎల్‌ జట్టు డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) అన్నాడు. ఈ సందర్భంగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీపై (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. 40 బంతుల్లో సెంచరీ చేయగల సత్తా అతడికి ఉందని సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొనియాడాడు.

భయం వీడాలి..

‘‘ఎలాంటి భయం లేకుండా ఆడడం చాలా ముఖ్యం. టీ20ల్లో ప్లేయర్ల వయసుకు సంబంధించి ఓ నిర్దిష్ట నియమేమీ లేదు. జేమ్స్‌ ఆండర్సన్‌ ఇంకా టెస్టులు ఆడుతూ.. 30 ఓవర్లు బౌలింగ్‌ వేస్తున్నాడు. 40 ఏళ్ల ధోని ఇంకా సిక్సర్లు బాదుతున్నాడు. బౌండరీలు కొట్టడం ముఖ్యం. జట్టు మొత్తం హిట్టింగ్‌పై దృష్టి సారించాలి. రోహిత్‌ (Rohit Sharma) , విరాట్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్య.. ఇలా చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లున్నారు. బౌండరీలు బాదడంలో వారి నైపుణ్యం అద్భుతం’’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

ఓపెనర్లుగా వీరిద్దరూ..

టీ20 ప్రపంచ కప్‌నకు (T20 World Cup) జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్‌ కమిటీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌పై ఉందని గంగూలీ గుర్తుచేశాడు. అయితే, తాను మాత్రం కోహ్లీ, రోహిత్‌ (Rohit Sharma) కలిసి ఓపెనింగ్‌కు దిగితే బాగుంటుందని భావిస్తున్నానన్నాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమనని.. సెలెక్టర్లు కచ్చితంగా ఇలాగే చేయాలని తాను సూచించడం లేదన్నాడు. తుది నిర్ణయం వారిదేనని స్పష్టం చేశాడు.

చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?

జైశ్వాల్‌కు అవకాశం ఉంది..

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌, ఐపీఎల్‌లో (IPL) ఫామ్‌ను బట్టి టీ20 కప్‌ ఎంపికకు జైశ్వాల్‌ దూరమైనట్లేనా అన్న ప్రశ్నకు గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు. అతడు అద్భుతమైన ప్లేయర్‌.. అతడి ఎంపికను అప్పుడే కొట్టిపారేయలేమని తెలిపాడు. కేవలం ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకొని టీ20 కప్‌ జట్టు సెలెక్షన్‌ ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టోర్నీలు, గత మూడు సీజన్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో నిరాశపర్చిన జైశ్వాల్‌ నెమ్మదిగా ఫామ్‌ అందుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో శతకం బాది రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

జట్టులో సమతూకం..

జూన్‌ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 కప్‌నకు (T20 World Cup) ఎంపిక చేసే జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులూ ఉండాల్సిన అవసరం ఉందని గంగూలీ తెలిపాడు. రెండింటి మధ్య సమతూకం అవసరమన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు