ODI World Cup 2023: వికెట్‌ కీపర్‌గా అతడే బెటర్.. సచినే ఎందుకు అత్యుత్తమమంటే?

ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) నేపథ్యంలో జట్టులో ఎవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సచిన్‌ ఎందుకు అత్యుత్తమో అక్తర్‌ విశ్లేషించాడు. ఇలాంటి విషయాల సమాహారం మీ కోసం..

Updated : 20 Aug 2023 13:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా స్టార్‌ వికెట్ కీపర్‌ - బ్యాటర్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) లేకపోవడంతో వన్డే వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిని కలిచివేస్తోంది. ముగ్గురు ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఎవరికి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్‌ బ్యాటర్లు కేఎల్ రాహుల్‌ (KL Rahul), సంజూ శాంసన్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) రేసులో ఉన్నాడు. సంజూ నుంచి గొప్ప ప్రదర్శన లేకపోవడంతో అతడికి చోటు దక్కడం కష్టమే. ఇక కేఎల్‌తోపాటు ఇషాన్‌ను బ్యాకప్‌గా తీసుకుంటారనే వాదనా ఉంది. కేఎల్ రాహుల్‌ గాయం నుంచి కోలుకుని ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతున్నాడు. పూర్తిస్థాయి వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు చేపట్టడం అంత సులువేం కాదు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) తన ఎంపిక ఎవరనేది వెల్లడించాడు. 

వరుస రోజుల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే..

‘‘ప్రస్తుతం భారత్‌లో పంత్‌ అత్యుత్తమ వికెట్‌ కీపర్. అలాగే ఇషాన్‌ కిషన్‌తోపాటు కేఎల్ రాహుల్‌ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. అయితే, కేఎల్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వీరిద్దరే ఇప్పుడు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌ మదిలో ఉంటారు. అయితే, ఇషాన్‌ కిషన్‌ వైపే నేను మొగ్గు చూపుతా. ఏ జట్టు తరఫున ఆడినా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడు. తప్పకుండా ద్రవిడ్ కూడా ఇషాన్‌ను తన ప్రణాళికల్లో ఉండేలా చూసుకోవాలి. వన్డే వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగే జట్టులో సీనియర్లతోపాటు యువకులు ఉండేలా ఎంపిక చేయాలి. జైస్వాల్, తిలక్ వర్మ, ఇషాన్‌ కిషన్ వంటి కుర్రాళ్లు ఎలాంటి బెరుకు లేకుండా ఆడేస్తారు. సెలెక్షన్ కమిటీ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. సరైన జట్టును ఎంపిక చేయాలి’’ అని గంగూలీ సూచించాడు. 


భీకర బౌలర్లను ఎదుర్కొని మరీ..: సచిన్‌పై అక్తర్ ప్రశంసలు

పాకిస్థాన్‌పై 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ ఇప్పటికీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. అన్ని ఫార్మాట్లు కలిపి వంద శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా రికార్డును తనపేరిట లిఖించుకున్న సచిన్‌ కంటే మరెవరూ అత్యుత్తమం కాదని పాక్‌ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. 

‘‘సచిన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌ అని ఎందుకు అంటాననే దానికి కారణం ఉంది. కెరీర్‌ ఆరంభంలోనే షేన్‌ వార్న్, మెక్‌గ్రాత్, వసీమ్‌ అక్రమ్‌తోపాటు విండీస్‌, దక్షిణాఫ్రికా భీకర పేసర్లను ఎదుర్కొని మరీ భారీగా పరుగులు సాధించాడు. పదేళ్ల తర్వాత నాతోపాటు బ్రెట్‌లీ, డేల్‌ స్టెయిన్ వంటి పేసర్ల బౌలింగ్‌లో ఆడాడు. అందుకే ‘అత్యుత్తమం’ కంటే చిన్న పదం వాడలేం. 2003 ప్రపంచ కప్‌లో మా జట్టుపై అతడు సాధించిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ అద్భుతం. సెహ్వాగ్‌తోపాటు ఇతర బ్యాటర్లతో కలిసి పాక్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అతడితోపాటు మిడిలార్డర్‌లో యువరాజ్‌ సింగ్‌ను అభినందించకుండా ఉండలేం. మిడిలార్డర్‌లో యువీ అద్భుతమైన ఆటగాడు’’ అని అక్తర్‌ విశ్లేషించాడు. 


భారత్‌ కంటే మా జట్టు మిడిలార్డర్‌ పటిష్ఠం: పాక్ మాజీ

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) బరిలోకి దిగనున్న భారత్‌ మిడిలార్డర్‌ (IND vs PAK) కంటే తమ దేశ మిడిలార్డర్‌ కాస్త బలంగా ఉందని పాక్‌ మాజీ ఆటగాడు బసిత్‌ అలీ వ్యాఖ్యానించాడు. భారత్ ఇప్పటికీ వికెట్‌ కీపర్‌గా తొలి ఎంపిక ఎవరనేది స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఆసియా కప్ కోసం జట్టును సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ‘‘పాక్‌ టాప్‌ ఆర్డర్‌లో బాబర్, ఫఖర్, ఇమామ్‌, రిజ్వాన్‌ ఉన్నారు. ఇఫ్తికార్‌ అహ్మద్, సల్మాన్‌ అలీ, షాదాబ్‌ ఖాన్, మహమ్మద్ నవాజ్‌తో కూడిన మిడిలార్డర్‌ ఉంది. భారత్‌తో పోలిస్తే ఇప్పటికైతే పాక్‌ మిడిలార్డర్‌ బెటర్. అయితే, ఇషాన్‌ కిషన్ ఐదో స్థానంలో ఆడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక యువ బ్యాటర్‌ తిలక్ వర్మను మూడో స్థానంలో ఆడించి.. విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో దింపితే సమతూకంగా ఉండే అవకాశం ఉంది. టాప్‌ ఆర్డర్‌లోని రోహిత్, గిల్, విరాట్‌ అద్భుతమైన ప్రదర్శన ఇస్తే ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టం’’ అని అలీ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని