Women's World Cup: వావ్‌ వోల్వార్ట్‌

Eenadu icon
By Sports News Desk Published : 30 Oct 2025 02:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఫైనల్లో దక్షిణాఫ్రికా
అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌
సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చిత్తు 
గువాహటి

సెమీఫైనల్‌ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ ఎంతో బలమైంది. నాలుగుసార్లు ఛాంపియన్‌. లీగ్‌ దశలో ఆ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయి ఉండడంతో దక్షిణాఫ్రికాపై పెద్ద అంచనాలే లేవు. కానీ సఫారీ జట్టు అదరగొట్టింది. కెప్టెన్‌ వోల్వార్ట్‌ అద్భుత శతకానికి మరిజేన్‌ కాప్‌ సూపర్‌ బౌలింగ్‌ తోడైన వేళ.. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ దక్షిణాఫ్రికా మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు టీ20 ప్రపంచకప్పుల్లో తుది పోరుకు అర్హత సాధించిన ఆ జట్టుకు.. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.

కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ (169; 143 బంతుల్లో 20×4, 4×6) హీరోచిత శతకంతో దక్షిణాఫ్రికా జట్టు మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఆ జట్టు 125 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. వోల్వార్ట్‌ పోరాటంతో మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. తజ్మిన్‌ బ్రిట్స్‌ (45; 65 బంతుల్లో 6×4, 1×6), మరిజేన్‌ కాప్‌ (42; 33 బంతుల్లో 4×4, 1×6), క్లో ట్రయాన్‌ (33 నాటౌట్‌; 26 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. సోఫీ ఎకిల్‌స్టోన్‌ (4/44) సూపర్‌గా బౌలింగ్‌ చేసింది. ఛేదనలో మారిజేన్‌ కాప్‌ (5/20) ధాటికి ఇంగ్లాండ్‌ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ (64; 76 బంతుల్లో 6×4, 1×6), అలీస్‌ క్యాప్సీ (50; 71 బంతుల్లో 6×4) రాణించారు. వోల్వార్ట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీస్‌ విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.

తేలిపోయిన ఇంగ్లాండ్‌: ఛేదనలో ఇంగ్లాండ్‌ తేలిపోయింది. ఆరంభమే ఆ జట్టుకు పెద్ద షాక్‌. టాప్‌ 3 బ్యాటర్లు ఖాతా అయినా తెరవకుండానే నిష్క్రమించారు. కాప్‌ తొలి ఓవర్లోనే అమీ జోన్స్, హెదర్‌ నైట్‌లను ఔట్‌ చేయగా.. రెండో ఓవర్లో బ్యూమాంట్‌ను ఖకా వెనక్కి పంపింది. ఒక్క పరుగుకే ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా పట్టుబిగించినట్లయింది. ఆ దశలో నాట్‌ సీవర్, క్యాప్సీ ఆదుకోవడంతో ఇంగ్లాండ్‌ కోలుకుంది. 23వ ఓవర్లో స్కోరు 108/3. కానీ క్యాప్సీని లుజ్‌.. కాసేపటి తర్వాత నాట్‌ సీవర్‌ను కాప్‌ పెవిలియన్‌ చేర్చడంతో 138/5తో ఇంగ్లాండ్‌ ఓటమి బాటలో పయనించింది. ఆ తర్వాత ఎవరూ ఇంగ్లాండ్‌ను ఆదుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ   జట్టు .. దక్షిణాఫ్రికాకు తలవంచింది. ఇంగ్లాండ్‌ 56 పరుగుల వ్యవధిలో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది.

దంచేసిన వోల్వార్ట్‌: దక్షిణాఫ్రికాకు 116 పరుగుల శుభారంభం లభించినా... ఆ జట్టు 319 చేయగలదని మాత్రం అనిపించలేదు. కానీ చెలరేగి ఆడిన వోల్వార్ట్, అద్వితీయ శతకంతో తన జట్టుకు భారీ స్కోరును అందించింది. 

దక్షిణాఫ్రికా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. బ్రిట్స్‌తో కలిసి వోల్వార్ట్‌ మంచి ఆరంభాన్నే ఇచ్చింది. 22 ఓవర్లకు దక్షిణాఫ్రికా 115/0తో నిలిచింది. కానీ చకచకా మూడు వికెట్లు కోల్పోయి 119/3తో చిక్కుల్లో పడింది. ఆ దశలో కాప్‌తో కలిసి వోల్వార్ట్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. దీంతో 191/3తో దక్షిణాఫ్రికా కోలుకుంది. కానీ 11 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి మళ్లీ చిక్కుల్లో పడింది. 41వ ఓవర్లో 202/6తో దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకునేలా కనిపించింది. కానీ అప్పటికే శతకం (115 బంతుల్లో) పూర్తి చేసిన వోల్వార్ట్‌ చెలరేగిపోయింది. ట్రయాన్‌ అండతో ఆమె చెలరేగిపోయింది. లిన్సీ ఓవర్లో ఆమె వరుసగా 6, 4, 4, 4 బాదేసింది. 48వ ఓవర్లో ఆమె ఔట్‌ కాగా.. ట్రయాన్‌ బ్యాట్‌ ఝళిపించడంతో ఆఖరి రెండు ఓవర్లలో దక్షిణాఫ్రికాకు 28 పరుగులొచ్చాయి. ఆఖరి 9 ఓవర్లలో ఆ జట్టు 111 పరుగులు చేసింది. లీగ్‌ దశలో ఇదే ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా 69 పరుగులకే ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: లారా వోల్వార్ట్‌ (సి) క్యాప్సీ (బి) బెల్‌ 169; బ్రిట్స్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 45; అనెకె బోష్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 0; లుజ్‌ (బి) నాట్‌ సీవర్‌ 1; మరిజేన్‌ కాప్‌ (సి) డీన్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 42; సినాలో జఫ్టా (బి) బెల్‌ 1; అనెరీ డెర్క్‌సెన్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 4; క్లో ట్రయాన్‌ నాటౌట్‌ 33; డిక్లెర్క్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 319; వికెట్ల పతనం: 1-116, 2-116, 3-119, 4-191, 5-192, 6-202, 7-291; బౌలింగ్‌: లారెన్‌ బెల్‌ 10-0-55-2; లిన్సీ స్మిత్‌ 10-0-69-0; నాట్‌ సీవర్‌ 8-0-67-1; చార్లీ డీన్‌ 10-0-67-0; సోఫీ ఎకిల్‌స్టోన్‌ 10-1-44-4; అలిస్‌ క్యాప్సీ 2-0-15-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: అమీ జోన్స్‌ (బి) కాప్‌ 0; బ్యూమాంట్‌ (సి) జఫ్టా (బి) ఖకా 0; హెదర్‌ నైట్‌ (బి) కాప్‌ 0; నాట్‌ సీవర్‌ (సి) జఫ్టా (బి) కాప్‌ 64; క్యాప్సీ (సి) డిక్లెర్క్‌ (బి) లుజ్‌ 50; డానీ వ్యాట్‌ (సి) సెఖుఖునె 34; డంక్లీ (సి) జఫ్టా (బి) కాప్‌ 2; చార్లీ డీన్‌ (సి) జఫ్టా (బి) కాప్‌ 0; ఎకిల్‌స్టోన్‌ (సి) డెర్క్‌సెన్‌ (బి) ఎంలబా 2; లిన్సీ స్మిత్‌ (సి) లుజ్‌ (బి) డిక్లెర్క్‌ 27; లారెన్‌ బెల్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (42.3 ఓవర్లలో ఆలౌట్‌) 194; వికెట్ల పతనం: 1-0, 2-0, 3-1, 4-108, 5-138, 6-144, 7-144, 8-151, 9-175; బౌలింగ్‌:  మరిజేన్‌ కాప్‌ 7-3-20-5; అయబోంగా ఖకా 8-0-28-1; నదైన్‌ డిక్లెర్క్‌ 5.3-0-24-2; ఎంలబా 8-0-40-1; లుజ్‌ 6-0-41-1; క్లో ట్రయాన్‌ 8-0-41-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు