Amol Muzumdar: వాళ్ల వెనుక అతడు

Eenadu icon
By Sports News Desk Published : 03 Nov 2025 04:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భారత మహిళల క్రికెట్‌ జట్టులో రెండేళ్ల కిందటి వరకు స్థిరత్వం లేదు. కొన్ని మ్యాచ్‌లు గెలవడం.. తర్వాత గెలిచే మ్యాచ్‌లు ఓడిపోవడం.. ఇలా సాగేది ప్రయాణం.  కానీ ఇప్పుడు భారత్‌ మారింది. బలమైన టీమ్‌లతో ఆడేటప్పుడు బెరుకు లేదు. పెద్ద లక్ష్యాలను ఛేదించాలన్న భయం లేదు. గెలవాలన్న తపన, పోరాటం పెరిగింది. ఇందుకు కారణాల్లో కోచ్‌ అమోల్‌ మజుందార్‌ ఒకడు. 2023లో మజుందార్‌ను భారత జట్టు కోచ్‌గా ఎంపిక చేసినప్పుడు చాలామంది పెదవి విరిచారు. అంతర్జాతీయ అనుభవమే లేదు ఏం మార్గనిర్దేశనం చేస్తాడని అన్నారు. అయితే దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ జూనియర్‌ జట్లకు కోచింగ్‌ ఇచ్చిన అనుభవంతో మజుందార్‌ భారత జట్టును గాడిలో పెట్టాడు. వారిలో తనపై నమ్మకాన్ని కలిగించి.. బలమైన జట్టుగా ఎదిగేందుకు కృషి చేశాడు. స్మృతి, హర్మన్‌ప్రీత్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని ఇచ్చాడు. క్రాంతి గౌడ్, శ్రీచరణి లాంటి యువ ప్లేయర్లను ప్రోత్సహించి వారు సత్తా చాటడంలో కీలకపాత్ర పోషించాడు. ఎన్నో మ్యాచ్‌ల అనుభవం లేని ఈ ఇద్దరూ ప్రపంచకప్‌ ఆడారంటే అది మజుందార్‌ ఇచ్చిన మద్దతు వల్లే. వన్డే ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి.. సెమీస్‌ అవకాశాలను క్లిష్టం చేసుకున్నప్పుడు జట్టు ధైర్యం కోల్పోలేదు. చివరిదాకా పోరాడాలని ప్రతి మ్యాచ్‌ ఫైనల్‌ మ్యాచ్‌గా భావించి బరిలో దిగాలని మజుందార్‌ నూరిపోసిన పాఠాలు ప్లేయర్లలో నాటుకుపోయాయి. ఫలితమే ప్రపంచకప్‌. 171 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలతో సహా 11 వేలకు పైగా పరుగులు చేసినా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మజుందార్‌.. కోచ్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. ఆటగాడిగా సాధించలేనిది కోచ్‌గా నెరవేర్చుకున్నాడు.  

ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు