David Warner: క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకుపడిన డేవిడ్ వార్నర్

Eenadu icon
By Sports News Team Updated : 06 Sep 2025 17:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: బాల్‌ టాంపరింగ్‌ స్కామ్‌లో ఆస్ట్రేలియా డ్యాషింగ్‌ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌పై (David Warner) 2018లో రెండేళ్లపాటు నిషేధం పడింది. స్టీవ్‌స్మిత్‌తో కలిసి వార్నర్ ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడు భవిష్యత్తులోనూ కెప్టెన్‌ కాకుండా బ్యాన్‌ విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తీవ్ర నిర్ణయం తీసుకుంది. మరోవైపు స్టీవ్‌స్మిత్‌పై మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో సీఏ తీరుపై వార్నర్ మద్దతుదారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఏ విధించిన కెప్టెన్సీ బ్యాన్‌పై రివ్యూ పిటిషన్‌ను వార్నర్ దాఖలు చేశాడు. అయితే, ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన రివ్యూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ తాజాగా మరోసారి క్రికెట్‌ ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరుపై డేవిడ్ వార్నర్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘నా విషయంలో సీఏ తీరు హాస్యాస్పదంగా ఉంది. నేను గతాన్ని ముగిద్దామని భావించా. కానీ, వారు (క్రికెట్ ఆస్ట్రేలియా) మాత్రం ఇంకా కొనసాగించాలనే ధోరణితో ఉన్నారు. ఎవరూ పారదర్శకంగా లేరు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకొన్నారు. సీఏ పాలనలో స్పష్టంగా నాయకత్వ లోపం కనిపించింది. నేను వదిలేద్దామని అనుకున్న ప్రతిసారీ సీఏ పెద్దలు దానిని బయటకు తీస్తూనే ఉన్నారు. అదంతా నా బ్యాటింగ్‌ ప్రదర్శనపై పెను ప్రభావం చూపింది. టెస్టు మ్యాచ్‌ల సందర్భంగా ప్రతి రోజూ నాకు ఉదయాన్నే ఫోన్లు వస్తాయి. లాయర్లతో మాట్లాడాల్సిన పరిస్థితి. నాకు అవసరం లేదు. ఇదంతా నాకు అగౌరవంగా అనిపించింది. అది నా బ్యాటింగ్ ప్రదర్శనపైనా పడింది. ఆటపై దృష్టిసారించలేకపోయా. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది. గతేడాది ఫిబ్రవరిలో మొత్తం డ్రామా ప్రారంభమైంది. దీంతో నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా’’ అని డేవిడ్ వార్నర్‌ వ్యాఖ్యానించాడు. 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వార్నర్‌ వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. అతడి ప్రదర్శనతోపాటు జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోనని ఆసీస్‌ అభిమానులు ఆందోళనగా ఉన్నారు.

Tags :
Published : 02 Jun 2023 15:13 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు