Jay Shah: జై షాపై రణతుంగ వ్యాఖ్యలు.. స్పందించిన శ్రీలంక ప్రభుత్వం

ఎస్‌ఎల్‌సీని బీసీసీఐ కార్యదర్శి జై షా నియంత్రిస్తున్నారని మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగా చేసిన ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది.

Updated : 18 Nov 2023 04:35 IST

కొలంబో: బీసీసీఐ (BCCI) కార్యదర్శి జై షా (Jay Shah)పై శ్రీలంక (SriLanka)మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం శ్రీలంక పార్లమెంట్‌ సమావేశాల్లో మంత్రులు హరీన్‌ ఫెర్నాండో, కాంచన విజేశేఖర ఒక ప్రకటన చేశారు. ‘‘ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాపై కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను శ్రీలంక ప్రభుత్వం ఖండిస్తుంది. వాటిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. మా సంస్థలోని లోపాలను ఏసీసీ అధ్యక్షుడు, కార్యదర్శికి ఆపాదించలేం. అది పూర్తిగా తప్పుడు భావన’’ అని మంత్రి విజేశేఖర అన్నారు. 

ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC)పై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని జై షాను శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే కోరినట్లు మంత్రి హరీన్‌ ఫెర్నాండో తెలిపారు. ‘‘ఎస్‌ఎల్‌సీపై ఐసీసీ విధించిన నిషేధం శ్రీలంకతోపాటు, వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఐసీసీ నిషేధం ఎత్తేయకుంటే.. శ్రీలంకకు ఎవరూ రారు. క్రికెట్‌ టోర్నమెంట్‌ ద్వారా శ్రీలంకకు ఆర్థికంగా ఎలాంటి లాభం ఉండదు’’ అని హరీన్‌ ఫెర్నాండో అన్నారు. 

‘చోకర్స్‌’కు అర్థమే వేరు.. మేం ఆసీస్‌పై చివరి వరకూ పోరాడాం: దక్షిణాఫ్రికా కోచ్

వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఘోర వైఫల్యం తర్వాత ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌సీ బీసీసీఐ కార్యదర్శి జై షా నియంత్రిస్తున్నారని శ్రీలంక మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగ ఆరోపించారు. ‘‘ఎస్‌ఎల్‌సీ అధికారులు, బీసీసీఐ మధ్య ఉన్న పరిచయాలతో వారు ఎస్‌ఎల్‌సీని నియంత్రించగలమని భావిస్తున్నారు. జై షా కనుసన్నల్లో ఎస్‌ఎల్‌సీ పనిచేస్తుంది. ఆయన ఒత్తిడితోనే ఎస్‌ఎల్‌సీ నాశనం అయింది’’ అని రణతుంగ ఆరోపించారు. మరోవైపు ఎస్‌ఎల్‌సీని రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి కోర్డు కొట్టేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని