SA vs AUS: ‘చోకర్స్‌’కు అర్థమే వేరు.. మేం ఆసీస్‌పై చివరి వరకూ పోరాడాం: దక్షిణాఫ్రికా కోచ్

కీలకమైన మ్యాచుల్లో ఓడిపోయే అలవాటు ఉన్న దక్షిణాఫ్రికా (South Africa) జట్టును ఇప్పటికే ‘చోకర్స్’ అంటూ ముద్ర వేశారు. అయితే, ఈసారి సెమీస్‌లో తాము అలాంటి పదానికి దూరంగా ఉన్నామని సఫారీ జట్టు ప్రధాన కోచ్ వ్యాఖ్యానించాడు.

Published : 17 Nov 2023 18:35 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) దక్షిణాఫ్రికా మరోసారి కీలక మ్యాచ్‌లో బోల్తాపడింది. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో సఫారీ జట్టు ఓటమిపాలైంది. దీంతో ‘చోకర్స్’ అనే ముద్ర వెంటాడుతూనే ఉంది. అయితే, తమ జట్టును అలా పిలవాల్సిన అవసరం లేదని.. ఆసీస్‌పై చివరి వరకూ పోరాడి ఓడామని దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌ రాబ్ వాల్టర్ స్పష్టం చేశాడు. అలాగే చోకర్స్‌ అనే పదానికి అర్థమేంటనేది తన మాటల్లో పేర్కొన్నాడు. 

‘‘చోక్‌ లేదా చోకర్స్‌ అంటే విజయం సాధించే స్థానంలో ఉండి ఓటమిని చవిచూసిన జట్టును అలా పిలవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే, ఆసీస్‌తో మ్యాచ్‌ మేం అద్భుతంగా పోరాడాం. ఆరంభంలో వెనుకబడినా పుంజుకుని మంచి పోటీనిచ్చాం. అయితే, మరో 30 లేదా 40 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల నష్టపోయాం. కానీ, 24/4 స్కోరు నుంచి 212 పరుగులు చేయగలిగాం. డేవిడ్ మిల్లర్‌ అద్భుత శతకం సాధించాడు. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే తప్పకుండా విజయం సాధించేవాళ్లమే. అప్పటికే ఆసీస్‌కు చెందిన ఏడుగురు బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాం.

అందుకే, ఈ మ్యాచ్‌లో ‘చోక్‌’ అనే పదానికి చోటు లేదు. మెగా టోర్నీలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య మంచి పోటీ నడిచింది. చివరికి మేం ఓటమిని చవిచూశాం. తొలి 12 ఓవర్లలో మాకు సవాల్ ఎదురైంది. అయితే, 24/4 నుంచి క్లాసెన్ -డేవిడ్ మిల్లర్‌ మంచి భాగస్వామ్యం నిర్మించారు. వారిద్దరూ ఉన్నప్పుడు స్కోరు 270 పరుగుల వరకు వెళ్తుందనిపించింది. కానీ, తొలి పది ఓవర్లలో గేమ్‌ మా చేతుల్లో లేకుండా పోయింది. కనీసం 250 పరుగులు చేసినా ఇంకాస్త పోటీనిచ్చే స్కోరయ్యేది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేయడం వల్లే ఇబ్బంది పడ్డారని ఎవరూ అనుకోవడం లేదు. కామెంటేటర్లు కూడా పిచ్‌ తొలి ఐదు ఓవర్లు ఇలా స్పందిస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. మా పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా అతడు వందశాతం అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేయలేకపోయాడు. ఐదెన్ మార్‌క్రమ్‌ను బౌలింగ్‌కు తీసుకురావాల్సి వచ్చింది. అయితే, అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. ఈ మ్యాచ్‌లో మేం ఓడినా ఎన్నో సానుకూలాంశాలతో ఇంటికివెళ్తున్నాం’’ అని వాల్టెర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని