World Athletics Championships: నీరజ్‌లా.. నిలిచేదెవరో? మన అథ్లెట్లు ఏం చేస్తారో?

హంగేరీలోని బుడాపెస్ట్‌లో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌(World Athletics Championships 2023)  పోటీలు శనివారమే ఆరంభమయ్యాయి. నిరుడు ఈ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ రజతం గెలిచాడు. మరి ఈ సారి పతకంతో నీరజ్‌లా నిలిచేదెవరో?

Updated : 20 Aug 2023 16:14 IST

2020 టోక్యో ఒలింపిక్స్‌ (2021)లో జావెలిన్‌ త్రో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు నీరజ్‌ చోప్రా(Neeraj Chopra). ఈ పసిడితో భారత అథ్లెటిక్స్‌లో విప్లవమే వచ్చింది. దేశంలో అథ్లెటిక్స్‌కు ఆదరణ పెరిగింది. ప్రపంచ స్థాయిలో మన ప్రదర్శన మెరుగైంది. మరోసారి భారత అథ్లెట్లు సత్తాచాటేందుకు ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌(World Athletics Championships 2023) రూపంలో మరో ప్రతిష్ఠాత్మక వేదిక దొరికింది. హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఈ పోటీలు శనివారమే ఆరంభమయ్యాయి. నిరుడు ఈ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ రజతం గెలిచాడు. మరి ఈ సారి పతకంతో నీరజ్‌లా నిలిచేదెవరో? గత నెలలో ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మన అథ్లెట్లు 6 స్వర్ణాలు సహా 27 పతకాలు సాధించారు. ఈ పోటీల చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పుడిదే జోరుతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. నీరజ్‌ సారథ్యంలో 27 మందితో బరిలో దిగుతున్న బలమైన భారత అథ్లెట్ల బృందంలో కచ్చితంగా పతకం సాధించేలా కొంతమంది కనిపిస్తున్నారు.

పసిడిపై గురి

నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రజతంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా.. ఈ సారి పసిడిపై గురి పెట్టాడు. డైమండ్‌ లీగ్‌ దోహా అంచె పోటీల్లో స్వర్ణంతో ఈ సీˆజన్‌ను ఘనంగా మొదలెట్టాడు నీరజ్‌. ఆ పోటీల్లో 88.67 మీటర్ల దూరం ఈటెను విసిరి ఛాంపియన్‌గా నిలిచాడు. కానీ ఆ తర్వాత కండరాల గాయంతో కొన్ని పోటీలకు దూరమయ్యాడు. తిరిగి కోలుకున్న తర్వాత లాసానె డైమండ్‌ లీగ్‌ అంచె పోటీల్లో స్వర్ణం (87.66మీ)తో సత్తాచాటాడు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలవడమే కాకుండా 90 మీటర్ల దూరాన్ని కూడా అందుకోవాలన్నది అతని లక్ష్యం. పురుషుల జావెలిన్‌ త్రోలో డీపీ మను, కిశోర్‌ కుమార్‌ కూడా బరిలో ఉన్నారు. 

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో రింకు సింగ్‌పై ప్రశ్న..

లాంగ్‌జంప్‌లో ఆ ఇద్దరూ

పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్‌ అల్డ్రిన్, శ్రీశంకర్‌ మురళీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాదిలో ప్రపంచంవ్యాప్తంగా లాంగ్‌జంప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్లలో వీళ్లిద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉండడమే కారణం. 2023లో జెస్విన్‌ ఉత్తమ ప్రదర్శన 8.42 మీటర్లు. శ్రీశంకర్‌ది 8.41మీ. ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్‌ వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ ఏడాది పారిస్‌ డైమండ్‌ లీగ్‌ అంచె పోటీల్లో కాంస్యంతో.. ఆ ఘనత సాధించిన భారత తొలి లాంగ్‌జంపర్‌గా నిలిచాడు. ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌ కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. అతను ఈ ఏడాది 17.37 మీటర్ల ప్రదర్శనతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ట్రిపుల్‌ జంపర్లలో ప్రవీణ్‌ నాలుగోవాడు. ఈ ఏడాది బరిలో దిగిన అయిదు టోర్నీలకు గాను మూడింట్లో 17 మీటర్లకు పైగా ప్రదర్శన నమోదు చేశాడు. 

మన తెలుగమ్మాయి

ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజిపై ప్రత్యేక దృష్టి నెలకొంది. 100మీ. హార్డిల్స్‌లో సంచలన ప్రదర్శనతో సాగుతున్న ఈ విశాఖ అమ్మాయి జాతీయ రికార్డును చాలా సార్లు బద్దలుకొట్టింది. ఇటీవల ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో కాంస్యం సాధించి.. 100మీ. హార్డిల్స్‌లో ఈ పోటీల్లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా 12.78 సెకన్ల టైమింగ్‌తో తన జాతీయ రికార్డు (12.82సె)నూ మెరుగుపర్చుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత (12.77సె) ప్రమాణానికి కేవలం 0.01 సెకన్ల దూరంలో నిలిచింది. అంతకంటే ముందు తన తొలి ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లోనే పసిడితో చరిత్ర సృష్టించింది. ఆ పోటీల చరిత్రలో 100మీ. హార్డిల్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌ ఆమెనే. ఇప్పుడు తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు షైలి సింగ్‌ (లాంగ్‌జంప్‌), అవినాష్‌ సాబ్లె (3000మీ స్టీపుల్‌ఛేజ్‌) కూడా పతకాలకు గట్టి పోటీదారులే.

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు