T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత బలమైన టీమ్‌: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

ఐపీఎల్ సంబరం ముగిసిన వారం రోజుల్లోనే మెగా టోర్నీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అమెరికా - విండీస్ ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్ జరగనుంది.

Published : 28 May 2024 14:16 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సంగ్రామం మొదలు కానుంది. మొత్తం 20 జట్లు కప్ కోసం తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు అమెరికాకు చేరుకున్నారు. మిగతావారూ వెళ్లిపోతారు. ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్లలోకెల్లా టీమ్‌ఇండియానే బలంగా ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్‌ను తక్కువగా అంచనా వేస్తే ఓటమి తప్పదని ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. 

‘‘ఇప్పుడున్న అన్ని టీముల్లోనూ గాయాల బెడద ఉంది. కానీ, భారత జట్టు లోతైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలతో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జట్లను పోల్చి చెబుతున్నా. ఈ టోర్నీలో ఫేవరెట్ టీమ్‌ భారత్‌ జట్టే. పేపర్‌ మీద నాణ్యమైన క్రికెటర్ల పేర్లను చూస్తున్నాం. మైదానంలోనూ అనుకున్న విధంగా ప్రణాళికలను అమలు చేస్తే వారిని అడ్డుకోవడం చాలా కష్టం. ఎవరినైనా ఓడించగల సత్తా ఉంది. 2007లో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ విజేత కాలేకపోయింది. ఇది కూడా ఆ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపుతుంది. ఈసారి మరింత దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పగలను’’ అని వెల్లడించాడు. 

పంత్‌ ‘కీ’ ప్లేయర్‌: పాంటింగ్‌

‘‘ఐపీఎల్‌లో రిషభ్‌ పంత్ ప్రదర్శన చూసిన తర్వాత.. నేను టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటే ఫస్ట్‌ అతడినే తీసుకుంటా. బీసీసీఐ పంత్‌ను సెలక్ట్‌ చేసి మంచి పని చేసింది. త్వరలో అతడి అంతర్జాతీయ మ్యాచ్‌ను చూడబోతున్నాం. దిల్లీ జట్టుకు కోచ్‌గా పంత్‌తో పనిచేయడం ఆస్వాదించా. ఇప్పుడు వరల్డ్‌ కప్‌లో ప్రభావం చూపే ఆటగాళ్లలో అతడే ప్రథముడు’’ అని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ తెలిపాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్‌ పంత్, సంజూ శాంసన్, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని