Virat Kohli: ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ

ఫుట్‌బాల్ స్టార్‌ సునీల్‌ ఛెత్రి రిటైర్మెంట్‌పై అతడి ఆప్తమిత్రుడు విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ఈ నిర్ణయంతో అతడికి సంతృప్తి లభించిందని అనుకొంటున్నట్లు వెల్లడించాడు.

Updated : 17 May 2024 18:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ-సునీల్‌ ఛెత్రి మధ్య ఉన్న స్నేహబంధం ఫ్యాన్స్‌ మొత్తానికి తెలిసిందే. తాజాగా మిత్రుడు ఛెత్రి (Sunil Chhetri) ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకడంపై విరాట్‌ (Virat Kohli) స్పందించాడు. మిత్రుడికి శుభాకాంక్షలు తెలిపాడు. వాస్తవానికి రిటైర్మెంట్‌ ప్రకటనకు ముందే తనకు ఈ విషయం వెల్లడించాడని కోహ్లీ పేర్కొన్నాడు. ఛెత్రి పోస్టుపై  ‘‘నా సోదరా.. గర్వించు’’ అని కామెంట్‌ చేశాడు. ఆర్సీబీ ఇన్‌సైడర్‌ షోలో ఈ అంశంపై మాట్లాడుతూ..‘‘అతడో గొప్ప ఆటగాడు. తాను ఆట నుంచి విశ్రాంతి తీసుకోనున్నట్లు నాకు మెసేజ్‌ చేశాడు. ఈ నిర్ణయంతో అతడు సంతృప్తి చెందినట్లు అనిపిస్తోంది. గత కొన్నేళ్లలో నాకు మంచి మిత్రుడయ్యాడు. అంతా బాగుండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. ఇక తన కుమార్తె వామిక ఇటీవల కాలంలో బ్యాట్‌ పట్టుకొంటోందని వెల్లడించాడు. అలాగని తాను క్రికెట్‌ నేర్చుకోమని బలవంతం చేయనన్నాడు. 

గత కొన్నేళ్లుగా కోహ్లీ-ఛెత్రి కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌ సీజన్‌లో వీరి మధ్య మంచి అనుబంధం పెరిగింది. వీరిద్దరూ గతేడాది కలిశారు. ఈసందర్భంగా చర్చకు వచ్చిన పలు అంశాలను ఛెత్రి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకొన్నాడు.

జూన్‌ 7వ తేదీన నేను ఏడుస్తాను..: ఛెత్రీ

జూన్‌ 6వ తేదీన రిటర్మైంట్‌ తీసుకొన్న మర్నాడు ఏం చేస్తాడో ఫుట్‌బాల్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రి వెల్లడించాడు. ఆటను వీడినా.. తనను శ్రమించే క్రీడాకారుడిగా చరిత్ర గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆట నుంచి విశ్రాంతి తీసుకోవాలన్న నిర్ణయం అంత సులువైందని కాదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆటను వీడానన్న విషయం జీర్ణించుకోవడం నాకు అంత తేలికైన పని కాదు. ఈ ఆటలో నేను కలలుగన్న దానికన్నా ఎక్కువ సాధించాను. జూన్‌ 6న రిటైర్మెంట్‌ తీసుకొంటాను. జూన్‌ 7న తనివితీరా ఏడ్చేస్తాను. 8వ తేదీన రిలాక్స్ అవుతాను. అప్పటినుంచి నా కుటుంబంతో కలిసి గడుపుతాను’’ అని పేర్కొన్నాడు.

జూన్‌ 6న కువైట్‌తో జరిగే ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌ అనంతరం రిటైర్‌ కానున్నట్లు ఛెత్రి ప్రకటించాడు. బుధవారం తన సోషల్‌మీడియా ఖాతాల్లో ఈ నిర్ణయాన్ని తెలిపాడు. ‘‘కువైట్‌తో మ్యాచ్‌ కెరీర్‌లో నాకు చివరిది’’ అని ఓ వీడియో విడుదల చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్‌ స్ట్రైకర్‌ ఇప్పటివరకు 94 గోల్స్‌ కొట్టాడు. దేశం తరఫున అత్యధిక గోల్స్‌ కొట్టిన, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కెరీర్‌ను ముగించనున్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని