IND vs PAK: షాట్ల ఎంపికపై ఇంత నిర్లక్ష్యమా..? భారత బ్యాటర్లపై సన్నీ ఆగ్రహం

పాకిస్థాన్‌పై భారత్‌ విజయం సాధించినప్పటికీ.. బ్యాటింగ్‌ లైనప్‌ ప్రదర్శన మాత్రం సునీల్‌ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది.

Updated : 11 Jun 2024 16:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బౌలర్లకు సహకరించే న్యూయార్క్‌ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 119 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 113/7 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. భారత్‌ విజయం సాధించినప్పటికీ బ్యాటింగ్‌ చేసిన తీరుపై క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

‘‘మన బ్యాటర్ల ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. షాట్ల ఎంపికలో నిర్లక్ష్యం వహించారు. గేమ్‌ను తేలిగ్గా తీసుకున్నట్లు అనిపించింది. ప్రతి బంతిని సులువుగా కొట్టేస్తామన్న అహంభావంతో ఉన్నారు. తొలి బంతి నుంచి దూకుడుగా ఆడేద్దామని అనుకున్నట్లుంది. కానీ, ఇది ఐర్లాండ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ కాదు. ఏదో చిన్న టీమ్‌ బౌలింగ్‌ చేసినట్లు భావించారు. ఇక్కడ ఐర్లాండ్‌ను అగౌరవపరచాలని కాదు. పాక్‌ వంటి అనుభవం కలిగిన డేంజరస్‌ బౌలింగ్‌ యూనిట్‌ను ఎదుర్కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఆలౌట్‌ కావడం బాధపెట్టే అంశం. కనీసం మరో ఐదు లేదా ఆరు పరుగులు రాబట్టినా ప్రత్యర్థిపై ఇంకా ఒత్తిడి తెచ్చినట్లైయ్యేది. 


విరాట్ ఔట్.. నిరుత్సాహానికి గురైన అనుష్క

పాకిస్థాన్‌ బౌలర్ నసీమ్ షా వేసిన బంతిని ఆడబోయిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్‌ను ఇచ్చేశాడు. కేలవం నాలుగు పరుగులను మాత్రమే చేసిన విరాట్ ఔట్ కావడంతో న్యూయార్క్‌ స్టేడియం నిశ్శబ్దంగా చూస్తుండిపోయింది. పాక్‌పై వరల్డ్‌ కప్‌లో మంచి రికార్డు కలిగిన కోహ్లీ స్వల్ప స్కోరుకే ఔట్‌ కావడంతో అభిమానులను నిరాశకు గురిచేసింది. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా నిరుత్సాహపడింది. ఒక్కసారిగా కెమెరాలన్నీ ఆమెపైనే ఫోకస్ చేశాయి. 


హార్దిక్‌ పాండ్య విభిన్నంగా సంబరాలు

వరల్డ్‌ కప్‌లో తన ప్రదర్శనతో జట్టు విజయాల్లో హార్దిక్‌ పాండ్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాకిస్థాన్‌పై రెండు కీలక వికెట్లు తీసి భారత్‌ను గెలిపించాడు. ఫకర్ జమాన్, షాదాబ్‌ ఖాన్‌ ఔట్ చేశాడు. షార్ట్‌పిచ్‌ బంతితో షాదాబ్‌ను పెవిలియన్‌కు పంపే సమయంలో పాండ్య విభిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్‌లోని 17వ ఓవర్‌లో పాండ్య వేసిన బంతిని ఆడబోయిన షాదాబ్‌ (4) వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ అద్భుత క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో పాక్‌ సగం వికెట్లను కోల్పోయింది. 


భారత బ్యాటర్ల ప్రదర్శనపై నెట్టింట కామెంట్లు

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా దారుణ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీమ్‌ఇండియా గెలిచినా.. వీరి ఆటతీరు నిరాశపరిచిందని నెట్టింట వ్యాఖ్యలు వస్తున్నాయి. పెద్ద మ్యాచుల్లో వీరు సరైన ప్రదర్శన చేయరంటూ విమర్శలు గుప్పించారు. ‘సూర్య.. నువ్వు బంగ్లా, శ్రీలంక వంటి జట్లపై ఆడేందుకు ప్రయత్నించు. ఇక జడేజా కూడా సుదీర్ఘఫార్మాట్‌తోపాటు ఐపీఎల్‌పైనే దృష్టిపెడితే బెటర్’ అని ఓ అభిమాని తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాడు. 


భావోద్వేగానికి గురైన నసీమ్ షా

తొలుత బౌలింగ్‌లో రాణించిన పాక్‌ పేసర్ నసీమ్ షా.. బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేసినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సిన క్రమంలో.. నసీమ్‌ వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. కానీ, భారత బౌలర్ అర్ష్‌దీప్‌ చక్కటి బౌలింగ్‌తో కట్టడి చేశాడు. నసీమ్‌ కేవలం ఒక్క పరుగుతోనే సరిపెట్టుకున్నాడు. మ్యాచ్‌ ఓడిపోవడంతో భావోద్వేగానికి గురైన నసీమ్‌ అలాగే డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ పక్కన ఉన్న షహీన్‌ అతడిని ఓదారుస్తూ కనిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని