IPL 2024: ఇకనైనా బౌండరీ లైన్ల పరిధిని పెంచండి..: సునీల్ గావస్కర్

ఐపీఎల్ జరిగే కొద్దీ బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. బౌలర్లు చేష్టలుడిగి చూసేందుకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురైంది.

Updated : 22 Apr 2024 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో పరుగుల సునామీ కొనసాగుతోంది. చాలా జట్లు అలవోకగా 200+ స్కోర్లు దాటేస్తున్నాయి. హైదరాబాద్ మరోఅడుగు ముందుకేసి 250+ స్కోర్లనే మూడు సార్లు చేసింది. ఇటీవల రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్’ రూల్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) బౌండరీ లైన్లను మార్చాలని సూచించాడు. బ్యాటర్లు హవా కొనసాగుతున్న ఐపీఎల్‌లో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందన్నాడు. 

‘‘క్రికెట్ బ్యాట్‌కు సంబంధించి నేనేమీ సూచనలు చేయను. ఎందుకంటే నిబంధనల ప్రకారమే దానిని తయారు చేస్తున్నారు. అయితే, బౌండరీల విషయంలో మాత్రం ఓ కీలక సూచన చేయాలనుకుంటున్నా. ప్రతి మైదానంలో బౌండరీల దూరం పెంచాలని ఎప్పటి నుంచో చెబుతున్నా. ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌ను చూస్తే.. సిక్సర్‌కు, క్యాచ్‌కు తేడా తెలియడం లేదు. వాణిజ్య ప్రకటనల బోర్డులను కూడా కాస్త వెనక్కి జరపాలి. కనీసం 2 లేదా 3 మీటర్ల వరకు బౌండరీ పరిధిని పెంచాలి. లేకపోతే బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడటం ఖాయం. 

క్రికెట్‌లో ఎప్పుడైనా సరే బ్యాటర్లు, బౌలర్లకు మధ్య భీకరపోరు జరిగితేనే మ్యాచ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిసారీ బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగినా బోర్‌ కొడుతుంది. గత కొన్ని రోజులుగా టీ20 క్రికెట్‌ను చూస్తుంటే.. కేవలం బ్యాటర్లదే హవా. ప్రతి కోచ్‌ కూడా తమ ఆటగాళ్లకు నెట్స్‌లో ప్రాక్టీస్‌ సందర్భంగా.. ‘ఇదే చివరి మ్యాచ్‌. దంచి కొట్టడమే’ అని చెబుతున్నట్లున్నారు. బ్యాటర్లు క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే హిట్టింగ్‌ మొదలుపెట్టేస్తున్నారు. తొలుత కాస్త బాగానే ఉన్నట్లు అనిపించినా.. మ్యాచ్‌ జరిగే కొద్దీ ఆసక్తికరంగా ఉండటం లేదు. దీని గురించి కాస్త పరుష పదాలను వాడాలని ఉన్నా.. ప్రయోగించడం లేదు’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని