Suresh Raina: ‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్‌స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్‌ నిష్క్రమణపై రైనా స్పష్టత

Suresh Raina: ఐపీఎల్‌ 2020 సీజన్‌ నుంచి ఆకస్మికంగా వైదొలగడంపై సురేశ్‌ రైనా ఎట్టకేలకు స్పష్టతనిచ్చాడు. బంధువులు హత్యకు గురవడం వల్లే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని వెల్లడించాడు.

Published : 22 Apr 2024 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్ మహమ్మారి సమయంలో యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్‌ 2020 నుంచి అప్పటి చెన్నై ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆయన టోర్నీ నుంచి వైదొలిగినప్పటికీ దీనిపై అప్పట్లో అనేక వదంతులు బయటికొచ్చాయి. ఫ్రాంచైజీ ప్రతినిధులతో విభేదాల కారణంగానే అతడు స్వదేశానికి తిరిగెళ్లినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

అయితే, ఇన్నేళ్ల తర్వాత ఈ వదంతులపై తొలిసారి స్పందించిన సురేశ్‌ రైనా.. నిష్క్రమణకు అసలు కారణాన్ని వెల్లడించాడు. బంధువుల మృతి కారణంగానే టోర్నీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘అప్పుడు మా కుటుంబంలో విషాదం నెలకొంది. బంధువులు మరణించారు. పఠాన్‌కోట్‌ (పంజాబ్‌)లో ఉన్న మా మామయ్య కుటుంబం మొత్తాన్ని గ్యాంగ్‌స్టర్లు చంపేశారు. ఈ ఘటనతో మా నాన్న తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అప్పటికే కొవిడ్‌ భయాలతో ఉన్న మా కుటుంబాన్ని ఇది మరింత కుంగుబాటుకు గురిచేసింది. ఆ సమయంలో క్రికెట్‌ కన్నా ఫ్యామిలీతో ఉండటమే ముఖ్యమని భావించా. ఇదే విషయాన్ని ధోనీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు చెప్పి స్వదేశానికి తిరిగొచ్చా. అయితే బయో-బబుల్‌ కారణంగా మళ్లీ జట్టుతో చేరలేకపోయా. ఆ మరుసటి ఏడాది 2021 సీజన్‌లో ఆడా. అప్పుడు మా జట్టు ట్రోఫీ కూడా గెలిచింది’’ అని రైనా తెలిపాడు.

వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్‌ రైనా

2020 ఆగస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైనా మామ అశోక్‌కుమార్‌ ఇంట్లో దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రైనా అత్త, మామ, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ నిమిత్తం జట్టుతో కలిసి యూఏఈ వెళ్లిన రైనా.. టోర్నీ ఆరంభానికి ముందే తిరిగొచ్చాడు. అప్పట్లో దీనిపై వివాదాస్పద కథనాలు వచ్చాయి.

కరోనా భయం, దుబాయ్‌లో దిగినప్పటినుంచి ఒంటరిగా ఉండటం, జట్టులో పది మందికి పైగా కరోనా పాజిటివ్‌ అని తేలడం రైనా మానసిక ఒత్తిడికి గురయ్యాడని తొలుత వార్తలు వచ్చాయి. తనకు కేటాయించిన హోటల్‌ గదిలో బాల్కనీ లేకపోవడంపై రైనా జట్టు యాజమాన్యంపై ఆగ్రహించాడని, బయో బబుల్‌ నిబంధనల్ని కూడా ఉల్లంఘించాడని.. ఈనేపథ్యంలో ఫ్రాంఛైజీ ప్రతినిధులతో మాటామాటా పెరిగి ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. వీటిని రైనా తాజాగా కొట్టిపారేశాడు. ఇదిలాఉండగా.. 2022 సెప్టెంబరులో రైనా ఆటకు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని