IND vs PAK - Suryakumar: క్రికెట్‌ ఆడేందుకే వచ్చాం.. పాక్‌కు సరిగ్గానే బదులిచ్చాం: ‘కరచాలనం’ వివాదంపై సూర్య

Eenadu icon
By Sports News Team Updated : 15 Sep 2025 09:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను టీమ్ఇండియా (India Beat Pakistan) చిత్తు చేసింది. పాక్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇక్కడ మ్యాచ్‌ ఫలితం కంటే మరొకటి హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత పాక్‌ క్రికెటర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం కూడా చేయలేదు. నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయారు. పోస్ట్ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కుల్‌దీప్‌ యాదవ్ మాత్రమే మాట్లాడారు. ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్య వెల్లడించాడు. అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ సూర్య పాల్గొన్నాడు. అక్కడ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడంపై సమాధానం ఇచ్చాడు. 

‘‘మేమిక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. పాక్‌కు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నా. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. జీవితంలో కొన్నిసార్లు క్రీడాస్ఫూర్తి కంటే ముందుండే విషయాలు ఉంటాయి. దానిని నేను పోస్ట్ ప్రెజెంటేషన్‌లోనే చెప్పా. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉన్నాం. మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాం. అలాగే, ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన ఆర్మీకి అంకితం ఇచ్చాం. వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. ఇప్పుడు డెడికేట్‌ చేయడానికి ఇంతకుమించిన మంచి సందర్భం మరొకటి లేదు” అని సూర్యకుమార్‌ తెలిపాడు.

స్పందించిన గంభీర్.. 

భారత విజయంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ స్పందించాడు. పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్య వెల్లడించిన తర్వాత బ్రాడ్‌కాస్టర్‌తో గంభీర్ మాట్లాడాడు. ‘‘జట్టుగా మేమంతా పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉండాలని భావించాం. వారికి సంఘీభావం తెలపాలని అనుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించిన మన సైన్యానికి ధన్యవాదాలు’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మ్యాచ్ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నామని అందులో పేర్కొన్నాడు.

Tags :
Published : 15 Sep 2025 08:43 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని