Suryakumar Yadav: సూర్య భాయ్‌.. ఇలాగైతే వన్డేల్లో కష్టమేనోయ్!

వన్డే ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav).. ఆసియా కప్‌లో వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకున్నాడు. ఓ పక్క యువ బ్యాటర్ గిల్ సెంచరీతో రాణించగా.. సూర్య మాత్రం తన బలహీనతను మరోసారి బయటపెట్టుకుని పెవిలియన్‌కు చేరాడు.

Published : 16 Sep 2023 14:57 IST

వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో ఉండటం గొప్పే కానీ.. స్టార్‌ ప్లేయర్ అయి ఉండి తుది జట్టులో స్థానం దక్కించుకుని మ్యాచ్‌లు ఆడలేకపోతే మాత్రం ‘ఉన్నా లేనట్లే’. బోలెడంత టాలెంట్‌ ఉంది. క్రీజ్‌లో కుదురుకుంటే వీరబాదుడు బాదేస్తాడనే పేరుంది. తీరా, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా వచ్చిన అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు మన ‘మిస్టర్ 360’ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్.  

Rohit Sharma: రోహిత్‌.. దశ సహస్ర వీర!

వన్డేల్లో గొప్ప ప్రదర్శన లేకపోయినప్పటికీ సూర్యకుమార్‌కు అవకాశాలు  వస్తూనే ఉన్నాయి. గత పది వన్డేల్లో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ లేదంటే మీరు నమ్మగలరా..? ఈ పదింట్లో అతడి అత్యధిక స్కోరు 35 పరుగులు కావడం గమనార్హం. టీ20ల్లో చిరుతలా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సూర్య.. 50 ఓవర్ల ఫార్మాట్‌కు వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. అయినా, వెస్టిండీస్‌ సిరీస్‌కు, ఆసియా కప్‌ జట్టులో ఉన్నాడు. ఇక వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించిన 15 మంది జాబితాలోనూ చోటు దక్కింది. ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సూర్య అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు.

ఈ ఆసియా కప్‌లో తొలిసారి..

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌ వెళ్లింది. దీంతో బంగ్లాదేశ్‌తో నామమాత్రమైన మ్యాచ్‌లో ప్రయోగాలకు కెప్టెన్ రోహిత్ సిద్ధమై టాస్‌ నెగ్గి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఫ్లడ్‌లైట్ల కింద ఛేదన ఎలా ఉంటుంది.. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు ఎలా ఆడతారు.. రిజర్వ్‌ బెంచ్‌లోని ఆటగాళ్లను పరీక్షించుకోవడానికి వేదికగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో యువ బ్యాటర్ తిలక్ వర్మతోపాటు సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం దక్కింది. టాప్‌ ఆర్డర్‌లో శుభ్‌మన్‌ గిల్ (121) మినహా మిగతావారంతా విఫలమై నిరాశపరిచారు. తిలక్‌ (5) త్వరగా పెవిలియన్‌కు చేరాడు. అయితే, మిడిలార్డర్‌లో కీలకంగా మారతాడని భావించిన సూర్య (26) ఆరంభంలో ఆచితూచి ఆడాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. అంతా ఓకే విలువైన పరుగులు చేస్తున్నాడని భావిస్తున్న వేళ.. తనకెంతో ఇష్టమైన స్వీప్ షాట్‌ను కొట్టే ప్రయత్నంలో బోల్తా పడ్డాడు. షకిబ్‌ తెలివిగా సంధించిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన సూర్య క్లీన్‌బౌల్డ్‌ కావడం గమనార్హం. 

ఎందుకిలా..?

టీ20 ఫార్మాట్‌లో సక్సెస్‌ అయిన నంబర్‌వన్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ అనూహ్యంగా వన్డేల్లో విఫలం కావడంపై అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. ఎందుకు ఇలా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడనే అనుమానాలు తలెత్తడం సహజమే. పొట్టి ఫార్మాట్‌లో ఇరగదీసే సూర్య వన్డేల్లో మాత్రం బ్యాట్‌ను ఝుళిపించకపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి. టీ20ల్లో సాధారణంగా బౌలర్లపై ఆ ఒత్తిడి ప్రభావం ఉంటుంది. నాలుగు ఓవర్ల కోటాలో భారీగా పరుగులు ఇవ్వకుండా ఉండాలనే లక్ష్యంతో బౌలర్లు బరిలోకి దిగుతారు. కానీ, బ్యాటర్లు మాత్రం ఉన్న కాసేపైనా వీరబాదుడు బాదేయడానికే చూస్తారు. అదే, వన్డేలకొచ్చేసరికి ఇదొక విభిన్నమైన ఫార్మాట్‌. ఇక్కడ తొలుత నిలకడగా ఆడాలి. ఆ తర్వాత కాస్త దూకుడు పెంచాలి.. చివర్లో బాదుడు మొదలెట్టాలి. అంటే ప్యాసింజర్‌ రైలు వేగం నుంచి ఎక్స్‌ప్రెస్‌ వేగానికి మారి.. అక్కడ నుంచి బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకుపోవాల్సి ఉంటుంది. కానీ, సూర్య మాత్రం వచ్చీ రాగానే దూకుడుగా ఆడటానికి ప్రయత్నించడం.. అతడిని ఊరించేలా బౌలర్లు బంతులను సంధించడం.. వాటికి దొరికిపోవడం కూడా కారణాలుగా విశ్లేషకుల అంచనా వేశారు. వన్డేల్లో వినియోగించే మైదానాలు, పిచ్‌లు కూడా విభిన్నంగా ఉంటాయి. టీ20ల్లో బ్యాటర్లకు అనుకూలంగా ఉండేవి వాడుతుంటారు. 50 ఓవర్ల ఫార్మాట్‌ విషయానికొస్తే మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానంగా అవకాశాలు ఉంటాయి. 

వన్డే భవిష్యత్తు కష్టమే..

ఇప్పుడు ఆసియా కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ మిగిలి ఉంది. అదీనూ శ్రీలంకతో ఫైనల్‌. కాబట్టి, సూర్యకుమార్‌కు తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు. మినీ టోర్నీ ముగిసిన తర్వాత ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ఉంది. సెప్టెంబర్ 22 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందులో అవకాశం వచ్చి రాణించలేకపోతే మాత్రం ప్రపంచ కప్‌ జట్టు నుంచి ఉద్వాసన తప్పకపోవచ్చు. ఒక వేళ స్క్వాడ్‌లో ఉన్నా తుది జట్టులో అవకాశం మాత్రం రావడం గగనమవుతుంది. మరోవైపు సంజూ శాంసన్‌ తన ఛాన్స్‌ కోసం కాచుకుని ఉన్నాడు. మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే రిషభ్ పంత్‌ లేనిలోటును సూర్యకుమార్‌ తీరుస్తాడని భావించినా.. అతడి ఫామ్‌ను చూస్తే తుది జట్టులో కనీసం స్థానం దక్కడం కూడా కష్టమే. 

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని