Suryakumar Yadav - Shubman Gill: స్కై జోరు పెంచాల్సిందే: సూర్య నెత్తిన.. వేలాడుతున్న గిల్‌ కత్తి

Eenadu icon
By Sports News Team Updated : 28 Oct 2025 15:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఆసియా కప్‌లో (Asia Cup), అంతకుముందు నుంచీ బ్యాట్‌తో పెద్దగా రాణించని భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) నెత్తి మీద.. శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) రూపంలో కత్తి వేలాడుతోంది! ఇప్పుడు కానీ సూర్య తన మునపటి జోరును చూపించకపోతే తన డిప్యూటీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు. 

ఆస్ట్రేలియాతో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ శర్మను (Rohit Sharma) తప్పించి గిల్‌ను నియమించారు. టీ20ల్లో వైస్‌ కెప్టెన్సీ కూడా ఇచ్చేశారు. నిర్ణయాల్లో ఈ వేగం చూస్తుంటే.. నెక్స్ట్‌ టార్గెట్‌ టీ20 నాయకత్వమే అంటున్నారు క్రికెట్ పరిశీలకులు. దానికి కారణం బ్యాటింగ్‌లో సూర్య కుమార్‌ వరుస వైఫల్యాలే అని అంచనా వేస్తున్నారు. కెప్టెన్‌ అయ్యాక సూర్య బ్యాటింగ్‌ గణాంకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 

తగ్గిన సూర్య ‘ప్రకాశం’!

ఆసియా కప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. గ్రూప్‌ స్టేజీలో పాకిస్థాన్‌ మ్యాచ్‌లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యూఏఈ మ్యాచ్‌లో 7* పరుగులు చేయగా ఒమన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి దిగలేదు. సూపర్‌ 4లో పాకిస్థాన్‌పై డకౌట్‌ అయ్యాడు. బంగ్లాదేశ్‌పై 5, శ్రీలంకపై 12 రన్స్‌ మాత్రమే చేశాడు. ఫైనల్‌లో పాక్‌పై ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇలా ఆసియా కప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ మొత్తం మీద 72 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. 

స్థాయికి తగ్గట్లు లేదు..

ఆసియా కప్‌లోనే కాదు.. అంతకుముందూ సూర్యకుమార్‌ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గట్లుగా లేదు. 2025లో టీ20 కెప్టెన్‌గా 11 ఇన్నింగ్స్‌లో కేవలం 100 పరుగులే చేశాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా కెప్టెన్‌గా 20 ఇన్నింగ్స్‌ల్లో 330 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అర్ధ శతకం చేసి సంవత్సరం దాటింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్‌ 12, 2024లో బంగ్లాదేశ్‌పై 75 పరుగులు చేశాడు. ఇటీవల ఆసియా కప్‌లో గ్రూప్‌ స్టేజీలో పాకిస్థాన్‌పై చేసిన 47* పరుగులే అత్యధికం. 

ఇప్పటికీ మేలుకోకుంటే.. 

భారత్‌, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ - 2026 ప్రారంభం కానుంది. దాని కంటేముందు టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాతో 5, దక్షిణాఫ్రికాతో 5, న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో సఫారీలు, కివీస్‌ మ్యాచ్‌లు స్వదేశంలో జరుగుతాయి. కాబట్టి ఆ మ్యాచుల్లో సూర్య మెరుగ్గా రాణించడం తప్పనిసరి. కెప్టెన్‌గా విజయాలు అందిస్తున్నా.. పరుగులు రాబట్టకుండా ఎక్కువ రోజులు జట్టులో కొనసాగడం కష్టమే. అందులోనూ కీలకమైన ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కి వస్తాడు. మరోవైపు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), బీసీసీఐ (BCCI) చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) ఈ మధ్య సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకి ఇబ్బందికర పరిస్థితి రాకుండా ఉండాలంటే... మునుపటిలా పరుగులతో ప్రకాశించాల్సిందే!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :
Published : 28 Oct 2025 14:21 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని