IND vs ENG: నాలుగో టెస్టులో విజయం.. సిరీస్‌ భారత్‌ వశం

టీమ్ఇండియా అదరగొట్టేసింది. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌ను నిలువరించి రాంచీలోనే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం 3-1 ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.

Updated : 26 Feb 2024 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విరాట్ కోహ్లీ, పుజారా, రహానె జట్టుకు దూరమయ్యారు.. కేఎల్‌ రాహుల్ రెండో టెస్టు నుంచి లేడు. శ్రేయస్‌ అయ్యర్ ఫామ్‌ కోల్పోయాడు. గాయం కారణంగా వైదొలిగాడు. జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్లే. కానీ, ఇంగ్లాండ్ బజ్‌బాల్‌కు ఎదురొడ్డి ఎలా ఆడతారనే సందేహాలను వారు పటాపంచలు చేసేశారు. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే.. సగర్వంగా ఐదు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్‌ అయిన చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది. 

రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో (IND vs ENG) జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్‌కు కఠిన సవాళ్లు ఎదురైన పరిస్థితుల్లో కుర్రాళ్లు ఓర్పు ప్రదర్శించారు. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‌మన్‌ గిల్ (52*) హాఫ్‌ సెంచరీలు సాధించగా.. యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్‌ జురెల్ (39*) విలువైన పరుగులు చేశారు. రజత్‌ పటీదార్‌ , సర్ఫరాజ్‌ ఖాన్ డకౌట్లుగా పెవిలియన్‌కు చేరారు. రవీంద్ర జడేజా (4) ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3.. టామ్‌ హార్ట్‌లీ, జోరూట్ చెరో వికెట్‌ తీశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక పరుగులు చేసిన ధ్రువ్ జురెల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

కొద్దిసేపు హడలెత్తించిన బషీర్..

ఓవర్‌ నైట్‌ 40/0 స్కోరుతో నాలుగో రోజులో లక్ష్యఛేదనను ప్రారంభించిన భారత్‌ కాసేపు బాగానే ఆడింది. అయితే, యశస్వి జైస్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను అండర్సన్‌ ముందుకు దూకి అందుకొన్నాడు. దీంతో తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించినట్లైంది. మరోవైపు రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. అయితే, హిట్‌మ్యాన్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేసిన కాసేపటికే ఔటయ్యాడు. భోజన విరామ సమయానికి 118/3 స్కోరుతో వెళ్లిన భారత్‌కు బ్రేక్‌ తర్వాత వచ్చీరాగానే.. భారీ ఎదురు దెబ్బ తగిలింది. షోయబ్‌ బషీర్‌ ఒకే ఓవర్‌లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా 120/5 స్కోరుతో నిలిచింది. ఈ సమయంలో మరొక వికెట్‌ పడి ఉంటే భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేసినా.. ధ్రువ్-శుభ్‌మన్‌ గిల్ పట్టుదల ప్రదర్శించారు. ఆరో వికెట్‌కు హాఫ్‌ సెంచరీ (72 పరుగులు) భాగస్వామ్యం నిర్మించి జట్టును విజయతీరాలకు చేర్చారు. 

​​​​​​

స్కోరు వివరాలు..

ఇంగ్లాండ్‌ : తొలి ఇన్నింగ్స్‌ 353, రెండో ఇన్నింగ్స్‌ 145

భారత్‌ : తొలి ఇన్నింగ్స్‌ 307, రెండో ఇన్నింగ్స్‌ 192/5 (విజయం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని