Rohit Sharma: ‘ఈ ప్రశ్నే తప్పు..’: రిపోర్టర్‌పై రోహిత్‌ శర్మ అసహనం

Rohit Sharma: మైదానంలోకి అభిమానులు పరిగెత్తుకురావడంపై ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసహనం వ్యక్తంచేశాడు. ఇది సరైన ప్రశ్న కాదన్నాడు.

Published : 05 Jun 2024 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం రాత్రి ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా (Team India) తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) మీడియాతో మాట్లాడాడు. ఈసందర్భంగా వార్మప్‌ మ్యాచ్‌ సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై రిపోర్టర్‌ అడగ్గా.. హిట్‌మ్యాన్‌ ఒకింత అసహనానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..?

మెగా టోర్నీ (T20 World Cup 2024)కి ముందు బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా ఏకైక వార్మప్‌ మ్యాచ్‌ (WarmUp Match) ఆడింది. ఆ సమయంలో ఓ అభిమాని ఉన్నట్టుండి మైదానంలోకి దూసుకొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని పట్టుకున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న రోహిత్‌ శర్మ.. కాస్త సున్నితంగా వ్యవహరించండి అంటూ భద్రతా సిబ్బందిని వారించినట్లుగా కన్పించింది.

ఆ ఇద్దరు.. ఆ కల నెలవేర్చుకుంటారా!

మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌ ఆ సంఘటన (Security Breach)ను ప్రస్తావిస్తూ.. ‘‘అభిమాని దూసుకురావడం.. సెక్యూరిటీ అతడిని పట్టుకున్న విధానం.. వదిలేయండని మీరు చెప్పడం.. ఆ సమయంలో మీరు ఎలాంటి ఎమోషన్‌కు లోనయ్యారు?’ అని అడిగాడు. దీనికి రోహిత్‌ అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. ‘ఆ సంఘటన.. మీ ప్రశ్న రెండూ తప్పే’ అని అన్నాడు.

‘‘గేమ్‌ మధ్యలో మైదానంలోకి ఎవరూ చొచ్చుకురావొద్దు. అది తప్పు. ఇక ఈ ప్రశ్న కూడా సరికాదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలను మేం ప్రోత్సహించబోం. ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యమైన అంశం. అదే సమయంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన వారి భద్రత కూడా అంతే ముఖ్యం. క్రికెట్‌ స్టేడియంలో నియమ, నిబంధనల గురించి అభిమానులు అర్థం చేసుకోవాలి. అప్పుడే మ్యాచ్‌ను మీరు ఆస్వాదించగలుగుతారు. ఇలా గ్రౌండ్‌లోకి పరిగెత్తుకురావాల్సిన అవసరం లేదు’’ అని రోహిత్‌ (Rohit Sharma) బదులిచ్చాడు. ఇలాంటి ఘటనలతో మైదానంలో ఆటగాళ్ల దృష్టి మరల్చలేరని, తమ ఆలోచనలంతా లక్ష్యంపైనే ఉంటుందని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని