Team India: ఇదేం ఇంజూరీ మేనేజ్‌మెంట్‌? టీమ్‌ఇండియాను వదలని గాయాల బెడద

ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ. అత్యుత్తమ ఫిట్‌నెస్ ప్రమాణాలు నెలకొల్పడానికి అవసరమైన వనరులన్నీ అందుబాటులో ఉన్నాయి.

Updated : 19 Feb 2024 15:05 IST

ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ. అత్యుత్తమ ఫిట్‌నెస్ ప్రమాణాలు నెలకొల్పడానికి అవసరమైన వనరులన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ, టీమ్ ఇండియాను గాయాల బెడద ఎంతకీ వదలడం లేదు. కోచ్‌ల వైఫల్యమా.. ఆటగాళ్ల తప్పిదమా తెలియట్లేదు కానీ.. ఒకరి వెంట ఒకరు కీలక ఆటగాళ్లు గాయపడుతూనే ఉన్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా.. ఫిట్‌నెస్ కోసం వ్యక్తిగతంగా ఎంతో శ్రమించే విరాట్ కోహ్లి ఒక్కడు మినహాయింపు. జట్టులోని మిగతా ఆటగాళ్లందరినీ ఏదో ఒక దశలో ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్ పాండ్య, దీపక్‌ చాహర్, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ షమి, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌.. ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? గత ఏడాదిన్నర వ్యవధిలో గాయాలతో ఇబ్బంది పడ్డ టీమ్‌ఇండియా ఆటగాళ్లు. చిన్న స్థాయి ఆటగాళ్లను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ జాబితా ఇంకా పెరుగుతుంది. క్రికెటర్లన్నాక గాయాలు సహజమే. ఒక ఆటగాడు మళ్లీ మళ్లీ గాయపడటం.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు అనుకునేలోపే మళ్లీ గాయాలు తిరగబెట్టడం.. ఎప్పుడు ఏ ఆటగాడు మ్యాచ్‌కు దూరమవుతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుండటం ఆందోళన కలిగించే విషయం. గతేడాది దీర్ఘకాలం గాయాలతో సహవాసం చేసి వన్డే ప్రపంచకప్‌ ముంగిట ఫిట్‌నెస్ సాధించిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. నాలుగు నెలలు తిరక్కముందే మళ్లీ గాయాల బారిన పడ్డారు.

ఇంగ్లాండ్‌‌తో తొలి టెస్టు అవ్వగానే రాహుల్, జడేజా జట్టుకు దూరమయ్యారు. రెండో టెస్టు తర్వాత శ్రేయస్ అందుబాటులో లేకుండా పోయాడు. రాహుల్‌, శ్రేయస్‌లకు పాత గాయాలే తిరగబెట్టినట్లు తెలుస్తోంది. మూడో టెస్టుకైనా రాహుల్ అందుబాటులోకి వస్తాడనుకుంటే కష్టమే అని తేలిపోయింది. జడేజాకు జట్టులో చోటు దక్కినప్పటికీ అతను పూర్తిగా కోలుకున్నాడనేమీ చెప్పట్లేదు. తుది జట్టులో ఆడించడం ఫిట్‌నెస్ క్లియరెన్స్ మీదే ఆధారపడి ఉంది. అతను రెండేళ్ల కిందట కూడా తీవ్ర గాయంతో నెలల తరబడి ఆటకు దూరంగా ఉన్నాడు. ఇంతలో గాయం తిరగబెట్టింది. మరోవైపు బుమ్రా ఏడాది పైగా గాయంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలో ఒకసారి పునరాగమనం చేసినట్లే చేసి వెనక్కి వెళ్లిపోయాడు. వన్డే ప్రపంచకప్ నుంచి అతను జట్టులో కొనసాగుతున్నాడు కానీ.. మన జట్టు ఇంజూరీ మేనేజ్‌మెంట్‌ టీం పనితనం చూస్తుంటే అతడికి ఎప్పుడు గాయం తిరగబెడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. జడేజా, రాహుల్‌ కలిపి మూడేళ్ల వ్యవధిలో 12 సార్లు గాయపడ్డారని ఇటీవల ఒక వార్త హల్‌చల్ చేసింది. ఇది మన ఇంజూరీ మేనేజ్‌మెంట్‌ ఎంత పేలవంగా ఉందో చెప్పడానికి ఉదాహరణ.

ఎన్‌సీఏలో ఏం జరుగుతోంది?

భారత ఆటగాళ్లలో గాయపడ్డ ప్రతి ఒక్కరి గమ్యం బెంగళూరులోని జాతీయ అకాడమీ (ఎన్‌సీఏ)నే. అక్కడ బీసీసీఐ నేతృత్వంలోని ఫిట్‌నెస్ టీం ఉంది. కోట్లల్లో వార్షిక జీతాలిచ్చి ఇంజూరీ మేనేజ్‌మెంట్‌ టీంను నడిపిస్తోంది బీసీసీఐ. అయితే కొన్ని నెలల పాటు అక్కడ ఉండి చికిత్స చేయించుకుని సాధన చేశాక కూడా ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్ సాధించట్లేదు. ముందు అక్కడ క్లియరెన్స్ ఇస్తారు. తీరా మైదానంలోకి వచ్చాక ఆటగాళ్లకు గాయాలు తిరగబెడతాయి. బుమ్రా విషయంలో బీసీసీఐ మెడికల్ టీం ఎలా నవ్వుల పాలైందో తెలిసిందే. అతను పూర్తి ఫిట్‌నెస్ అని ప్రకటించాక రెండు మూడు మ్యాచ్‌లు ఆడేసరికే గాయం తిరగబెట్టి తిరిగి ఎన్‌సీఏకు చేరాడు. రాహుల్, శ్రేయస్ అతడితో పోలిస్తే కొంత ఎక్కువ కాలం జట్టుతో కొనసాగారు.

ఇప్పుడు పాత గాయాలు తిరగబెట్టి చలో ఎన్‌సీఏ అన్నారు. జడేజాది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి. కోహ్లిలా వ్యక్తిగతంగా ఉత్తమ ఫిట్‌నెస్ ప్రమాణాల కోసం కష్టపడితే ఏ సమస్యా ఉండదు. కానీ మిగతా వాళ్లు అతడి స్థాయిలో ఉత్తమ స్థితిలో ఉండట్లేదు. మరి ఆటగాళ్లను దృఢంగా తీర్చిదిద్ది గాయాల బారిన పడకుండా పర్యవేక్షించాల్సిన బీసీసీఐ బృందం ఈ విషయంలో విఫలమవుతోందన్నది స్పష్టం. ప్రపంచంలో మరే అంతర్జాతీయ జట్టుకూ లేని స్థాయిలో టీమ్ఇండియాను మాత్రమే ఫిట్‌నెస్ సమస్యలు ఎందుక వేధిస్తున్నాయంటే ఇంజూరీ మేనేజ్‌మెంట్‌లో విఫలమవుతున్నట్లే కదా?

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని