Champions Trophy: మనదే మినీ ప్రపంచం

Eenadu icon
By Sports News Desk Updated : 10 Mar 2025 04:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత టీమ్‌ఇండియా
ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం


2023 నవంబరు 19.. 

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు ఊహించని పరాజయంతో యావత్‌ దేశం మౌనంగా విలపించిన రోజు! వన్డేల్లో కెప్టెన్‌ రోహిత్‌శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి శకం ముగిసిందనుకున్న సందర్భం!


2025 మార్చి 9..  

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మూడోసారి విజేతగా నిలిచిన రోజు. న్యూజిలాండ్‌పై విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది రోహిత్‌సేన!

ఏడాదిన్నరలోపే ఎంత మార్పు! వన్డేల్లో కెరీర్‌ ముగిసిందనుకున్న రోహిత్‌-కోహ్లి ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీ విజయానికి ప్రధాన సూత్రధారులు. నెమ్మదిగా ఉన్న పిచ్‌లపై కోహ్లి తన అనుభవాన్నంతా రంగరించి కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఫైనల్‌కు చేర్చగా.. టోర్నీ ఆసాంతం అద్భుతమైన నాయకత్వ పటిమ ప్రదర్శించడమే కాక, తుది పోరులో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు రోహిత్‌.

ఇక జట్టులోని ప్రతి ఆటగాడూ టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసి విజయాల్లో తన వంతు పాత్ర పోషించడం ఈ కప్పులో మరో ప్రత్యేకత. ఆతిథ్య దేశం పాకిస్థానే అయినా, ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించి.. తమ మ్యాచ్‌లకు దుబాయ్‌ని వేదికగా మార్చుకున్న టీమ్‌ఇండియా.. ఇక్కడి పరిస్థితులను గొప్పగా ఉపయోగించుకుంటూ ప్రతి మ్యాచ్‌ పక్కా ప్రణాళికతో ఆడి కప్పు అందుకుంది. టాప్‌-8 జట్లతో, సవాలు విసిరే ఫార్మాట్లో, బలమైన పోటీ ఎదురైన ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌ ఓడకుండా కప్పును సొంతం చేసుకుని తాను అసలైన ఛాంపియన్‌ జట్టని రుజువు చేసింది రోహిత్‌ సేన. 

ఇంతకుముందు 2000లోనూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో (అప్పుడు ఐసీసీ నాకౌట్‌ టోర్నీ అని పేరు) భారత్, న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరాయి. అప్పుడు భారతే ఫేవరెట్‌. కానీ టీమ్‌ఇండియా గెలుపు బాటలో ఉండగా.. కివీస్‌ అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించి షాకిచ్చింది. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో కివీస్‌ కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇప్పుడు గ్రూప్‌ దశలోనే కాక ఫైనల్లోనూ న్యూజిలాండ్‌ను ఓడించి కప్పు గెలిచిన టీమ్‌ఇండియా.. నాటి ఓటములకు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.


ఆద్యంతం మనదే అధిక్యం

ది అసాధారణ మ్యాచ్‌.. అసాధారణ ఫలితం. దేశానికి ఐసీసీ ఛాంపియన్స్‌ తీసుకొచ్చిన క్రికెట్‌ జట్టును చూస్తే గర్వంగా ఉంది. టోర్నీ ఆద్యంతం మన జట్టు గొప్పగా ఆడింది. అద్భుత ప్రదర్శన చేసిన జట్టుకు అభినందనలు. 

ప్రధాని మోదీ


పోరాటపటిమే గెలిపించింది

సీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత క్రికెట్‌ జట్టు సాధించిన అద్భుత విజయాన్ని యావత్తు దేశం ఆస్వాదిస్తోంది. టోర్నీలో రోహిత్‌ సేన పోరాటపటిమ కనబరిచింది.  ఇండియన్‌ క్రికెట్‌ టీంకు శుభాకాంక్షలు. 

ఎక్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు 


ముఖ్యమంత్రి హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్కంఠగా సాగిన ఛాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం సాధించడంపై సీఎం రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు.  భారతజట్టుకు  మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 


కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ల అభినందనలు..
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత జట్టుకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు అభినందనలు తెలిపారు. రోహిత్‌ సేన ఒక్క ఓటమి లేకుండా అప్రతిహత విజయాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. 


భారత్‌కిది మూడో ఛాంపియన్స్‌ ట్రోఫీ. అత్యధికసార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే. ఆస్ట్రేలియా (2006, 2009) రెండో స్థానంలో ఉంది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి టైటిల్‌ సాధించింది. 

 

Tags :
Published : 10 Mar 2025 03:27 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు