Virat - Siraj: మియా వెనుక భయ్యా... సిరాజ్‌ను దిద్దిన విరాట్‌ కోహ్లి

ఆసియా కప్‌ ఫైనల్‌ (Asia Cup 2023 Final)లో మహ్మద్‌ సిరాజ్‌ (Mohammad Siraj) బెస్ట్‌ ఇచ్చాడు. అయితే అలాంటి బౌలర్‌ మనకు ఇప్పుడు దొరకడం వెనుక విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఉన్నాడని తెలుసా?

Updated : 19 Sep 2023 16:53 IST

సిరాజ్‌.. సిరాజ్‌.. సిరాజ్‌.. ఆదివారం ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మొదలైన కాసేపట్నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్‌ టాపిక్‌. ఈ హైదరాబాదీ ఫాస్ట్‌బౌలర్‌ (Mohammad Siraj) భారత వన్డే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రదర్శన చేశాడు శ్రీలంకపై. అతడి ధాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఒకే ఓవర్లో 4 వికెట్లు, మొత్తంగా 6 వికెట్లతో అబ్బురపరిచాడు సిరాజ్‌. ఈ ఒక్క మ్యాచ్‌  (Asia Cup 2023 Final) అని కాదు.. కొంత కాలంగా సిరాజ్‌ ప్రదర్శన గొప్పగా సాగుతోంది. ఒకప్పుడు ఇతడికి జట్టులో చోటు అవసరమా అని విమర్శలు ఎదుర్కొన్నవాడు.. ఇప్పుడు టీమ్‌ఇండియాలో ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదగడం వెనుక మాజీ కెప్టెన్, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) పాత్ర కీలకం.

అభిమానులు మియా అని ముద్దుగా పిలుచుకునే సిరాజ్‌.. శ్రీలంకపై ఆరు వికెట్ల ప్రదర్శనతో జట్టుకు ఆసియా కప్‌ను అందించిన అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం, నీలి రంగు జెర్సీని ధరించడం.. జట్టును గెలిపించడం ఎంత ప్రత్యేకమో చెబుతూ అతను ఉద్వేగానికి గురయ్యాడీ పోస్టులో. తన కెరీర్లోనే ఇది ఉత్తమ ప్రదర్శన కావడం వల్లే అతనంత ఎమోషనల్‌ అయ్యాడు. ఈ పోస్టుకు అతను జోడించిన ఫొటోలో విరాట్‌ కోహ్లి ఉండటం గమనార్హం. మామూలుగా అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కాబట్టి అతడితో కలిసున్న ఫొటో పెట్టాలి. కానీ ఇక్కడ కోహ్లితో కలిసి ఆనందాన్ని పంచుకున్న ఫొటో పెట్టాడంటే రోహిత్‌ను తక్కువ చేసినట్లేమీ కాదు. విరాట్‌ మీద అతడికున్న అభిమానం, కృతజ్ఞతా భావమే ఇందుక్కారణం. 

హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన కుర్రాడు.. ఈ రోజు టీమ్‌ఇండియా ప్రధాన పేసర్లలో ఒకడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడంటే అందుకు ముఖ్య కారకుల్లో కోహ్లి ఒకడు. అసలు సిరాజ్‌ అనే పేరు దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులకు పరిచయం కావడంలో విరాట్‌ పాత్ర ఎంతో ఉంది. ఐపీఎల్‌లో 2017లో సన్‌రైజర్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతణ్ని తర్వాతి సీజన్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి తీసుకున్నాడు విరాట్‌. ఆ జట్టులోకి రాగానే అతనేమీ మెరుపులు మెరిపించేయలేదు. మొదట్లో కొంత తడబడ్డాడు. కొన్ని మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చేశాడు. అయినా అతడి మీద విరాట్‌ భరోసా ఉంచాడు. పెద్ద సూపర్‌ స్టార్‌ అయినప్పటికీ.. జూనియర్‌ బౌలర్‌ మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టి ప్రోత్సహించాడు. కోహ్లి అంతటివాడు తనను నమ్మి అండగా నిలవడంతో సిరాజ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. 

ఐపీఎల్‌లో జోరందుకోవడంతో అతడికి టీమ్‌ఇండియాలోనూ చోటు దక్కింది. కానీ అక్కడా అతడికి ఆరంభంలో ఎదురు దెబ్బలే తగిలాయి. పెద్దగా వికెట్లు పడలేదు. అతడి బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు చితకబాదారు. దీంతో వేటు తప్పలేదు. కానీ ఐపీఎల్, దేశవాళీల్లో రాణించి తిరిగి జట్టులోకి వచ్చాడు. విరాట్‌ సారథిగా ఉండగానే అతను టీమ్‌ఇండియాలో కుదురుకున్నాడు. అతడిపై విరాట్‌ అతి నమ్మకం పెట్టడంపై విమర్శలు కూడా వచ్చాయి ఓ దశలో. అయినా విరాట్‌ వెనక్కి తగ్గలేదు. సిరాజ్‌ కూడా కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ తర్వాతి కాలంలో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా 2020-21 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో అతడి సంచలన ప్రదర్శన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించింది. 

తన తండ్రి మరణించినా స్వదేశానికి రాకుండా.. దుఃఖాన్ని దిగమింగి గొప్ప ప్రదర్శన చేశాడు సిరాజ్‌. ఆ కఠిన సమయంలో సిరాజ్‌కు అండగా నిలిచింది విరాటే. సిరీస్‌ మధ్యలో కోహ్లి వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేసినా సిరాజ్‌ గొప్ప బౌలింగ్‌ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కోహ్లిని సోదరుడిగా భావించే సిరాజ్‌.. తాను ఎప్పుడు విజయవంతం అయినా తన ‘భయ్యా’కు కృతజ్ఞతలు చెప్పుకొంటాడు సిరాజ్‌. సందర్భం వచ్చినపుడల్లా కోహ్లిని కొనియాడతాడు. ఇక విరాట్‌ అయితే.. సిరాజ్‌ వికెట్‌ తీస్తే అతణ్ని మించి సంబరాలు చేసుకుంటాడు. కెప్టెన్సీకి దూరమయ్యాక కూడా అతడికి బెంగళూరు జట్టులో, టీమ్‌ఇండియాలో అండగా నిలుస్తున్నాడు.

2023లో అదరహో..

కెరీర్‌ ఆరంభంలో సిరాజ్‌ బౌలింగ్‌ చూసిన వాళ్లు అతను టీమ్‌ఇండియా ప్రధాన పేసర్లలో ఒకడవుతాడని ఊహించి ఉండరు. ప్రస్తుతం బుమ్రా, షమి లాంటి సీనియర్ల కన్నా అతను గొప్ప ప్రదర్శన చేస్తున్నాడు. ఒకప్పుడు జట్టులో తొలి ప్రాధాన్య బౌలర్‌గా ఉన్న షమి.. సిరాజ్‌ మెరుపుల తర్వాత తుది జట్టుకు దూరమయ్యాడు. 2023లో సిరాజ్‌ జోరు మామూలుగా లేదు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ అతను దూకుడు ప్రదర్శిస్తున్నాడు. వన్డేల్లో 13 మ్యాచ్‌లాడి 12.96 సగటుతో 29 వికెట్లు తీసిన సిరాజ్‌.. ఆసియా కప్‌లో అదరగొట్టి వన్డే ప్రపంచకప్‌ ముంగిట జట్టుకు గొప్ప భరోసాను ఇస్తున్నాడు. పునరాగమనంలో బుమ్రా కూడా ఫామ్‌ చాటుకోగా.. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ అదరగొడుతున్నాడు. సిరాజ్‌ కూడా పతాక స్థాయిని అందుకోవడంతో ప్రపంచకప్‌లో భారత బౌలింగ్‌తో ప్రత్యర్థులకు సవాల్‌ తప్పేలా లేదు.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని