Sunil Narine: టీ20 వరల్డ్ కప్‌తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్‌

మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. 

Published : 23 Apr 2024 15:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17 సీజన్‌లో కోల్‌కతా బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అదరగొడుతున్నాడు. క్రీజులో కుదురుకుంటే చాలు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 286 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. బంతితోనూ ఆకట్టుకుంటూ 7.11 ఎకానమీతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. దీంతో జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌తో నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై అతడు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తాను తిరిగి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం అసాధ్యమని, రీ ఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని స్పష్టం చేశాడు. 

‘‘ఇటీవల కాలంలో నేను చేసిన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయి. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని 2024 టీ20 ప్రపంచకప్‌ ఆడాలని అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తా. నేను నా రిటైర్మెంట్ నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నా. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాలనే ఆలోచన లేదు. ఇప్పుడు ఆ తలుపులు మూసుకుపోయాయి. జూన్‌లో వెస్టిండీస్‌ తరఫున టీ20 ప్రపంచకప్‌ ఆడే ఆటగాళ్లకు నా మద్దతు ఉంటుంది. గత కొన్ని నెలలుగా కష్టపడ్డ కుర్రాళ్లకు టైటిల్‌ గెలిచే సత్తా ఉంది. ఆల్‌ ది బెస్ట్’’ అని సునీల్ నరైన్‌ పేర్కొన్నాడు. నరైన్‌ విండీస్ తరఫున చివరగా 2019లో ఆడాడు. తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని