Punjab Vs Mumbai: డేవిడ్‌, పొలార్డ్‌కు భారీ జరిమానా.. ‘డీఆర్‌ఎస్‌ సిగ్నల్‌’ వివాదమేనా కారణం?

ముంబయి ఆటగాడు, కోచ్‌పై ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. 

Published : 20 Apr 2024 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి బ్యాటర్ టిమ్‌ డేవిడ్, బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్ పొలార్డ్‌లపై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తీవ్ర చర్యలు చేపట్టింది. పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా డగౌట్‌లో కూర్చుని.. క్రీజ్‌లోని బ్యాటర్లకు డీఆర్‌ఎస్‌ సిగ్నల్‌ ఇవ్వమని సైగలు చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. దీనిని గమనించిన పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ సామ్ కరన్ (Sam Curran)ఈ విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. అవేవీ పట్టించుకోని ఫీల్డ్‌ అంపైర్‌ డీఆర్ఎస్‌ రిఫర్‌ చేయడం గమనార్హం. దీంతో అంపైరింగ్‌ వ్యవస్థపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ముంబయి జట్టుకు అనుకూలంగా మారుతుందనే ట్రోలింగ్‌ మొదలైంది. 

ఈక్రమంలో కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను డేవిడ్, పొలార్డ్ ఉల్లంఘించినట్లు భావించిన అడ్వైజరీ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘టిమ్‌ డేవిడ్, పొలార్డ్‌ ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.0 ప్రకారం లెవల్‌ 1 నేరానికి పాల్పడ్డారు. వారిద్దరి మ్యాచ్‌ ఫీజ్‌లో చెరో 20 శాతం జరిమానాగా విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. అయితే, ఎందుకు జరిమానా విధిస్తున్నామనేది అందులో చెప్పకపోవడం గమనార్హం. 

పంజాబ్‌ వ్యూహంపై చోప్రా ఆగ్రహం

ఆరంభంలో వికెట్లను కోల్పోయినప్పటికీ శశాంక్‌సింగ్, అశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్‌లతో పంజాబ్‌ విజయానికి చేరువగా వచ్చింది. వారిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో ముంబయి చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో పంజాబ్ వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ‘‘మీరు 14/4 స్కోరు వద్ద ఉన్నప్పుడు.. మీరు రేసులోనే లేరు. ప్రధాన ఆటగాళ్లుగా భావిస్తున్నవారంతా పెవిలియన్‌కు చేరారు. అలాంటప్పుడు శశాంక్‌ను ఆరో వికెట్‌గా పంపారు.  దేశవాళీ క్రికెట్‌లో అనుభవం కలిగిన ఆటగాడు. అతడిని మీరు ఫినిషర్‌గా ఎలా నిర్ణయించుకున్నారు. అద్భుతంగా ఆడినప్పటికీ ఇంకాస్త ముందుగా పంపించి ఉంటే వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసేవాడు. కేవలం బ్యాటింగ్‌ చేయడంతోపాటు దూకుడు మాత్రమే ఫినిషర్‌ పాత్రకు సరిపోదు’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు