WTC Final : అదే మాకు విజయాన్ని దూరం చేసింది.. రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియా మరోసారి WTC Finalలో పేలవ ప్రదర్శన చేసింది. దీంతో రెండోసారి ఓటమిని మూటగట్టుకుని అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.

Updated : 11 Jun 2023 19:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : రెండోసారి WTC Final చేరిన భారత్‌(Team India).. పేలవ ప్రదర్శన చేసింది. కీలక సమరం(India vs Australia)లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమిని చవి చూసింది. అన్ని విభాగాల్లో విఫలమై.. ఐసీసీ ట్రోఫీని చేజార్చుకుంది. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఓటమిపై మాట్లాడాడు.

చివరి వరకూ పోరాడాం.. కానీ

‘టాస్‌ గెలిచి.. వారిని ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్‌కు దించడంతో ఈ టెస్టును మేం బాగానే ప్రారంభించామని అనుకున్నాం. తొలి సెషన్‌లో మేం బాగానే బౌలింగ్‌ చేశాం. ఆ తర్వాత మా ప్రదర్శన తగ్గింది. ఆసీస్‌ బ్యాటర్లకు క్రెడిట్‌ ఇవ్వాలి. స్మిత్‌తో కలిసి హెడ్‌ అద్భుతంగా ఆడాడు. అదే మమ్మల్ని విజయానికి దూరం చేసింది. గేమ్‌లో తిరిగి పుంజుకోవడమనేది ఎంత కష్టమో తెలుసు. అయితే.. మేం మంచి ప్రదర్శనే ఇచ్చామని భావిస్తున్నా. చివరి వరకూ పోరాడాం. గత నాలుగేళ్లుగా ఎంతో కష్టపడ్డాం. నిజాయతీగా చెప్పాలంటే.. రెండు ఫైనళ్లు ఆడటమంటే.. గొప్ప అచీవ్‌మెంట్‌గానే భావించాలి. మేం ఇంతవరకూ వచ్చేందుకు రెండేళ్లుగా పడిన శ్రమను.. ఈ ఓటమితో తీసివేయలేరు. మొత్తం టీమ్‌ నుంచి గొప్ప శ్రమ ఇది. దురదృష్టవశాత్తూ.. మేం ఫైనల్‌లో విజయం సాధించలేకపోయాం. కానీ.. మా పోరాటం కొనసాగుతుంది. ఇక అభిమానుల మద్దతు మరువలేనిది. ప్రతిఒక్కరికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని రోహిత్‌ శర్మ(Rohit Sharma) మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ అన్నాడు.

వారిద్దరిదీ అద్భుత భాగస్వామ్యం

‘మేం టాస్‌ ఓడిపోయాం.. అయితే ట్రావిస్‌ హెడ్‌, స్మిత్‌ అద్భుత భాగస్వామ్యం.. మాకు అద్భుత ప్రారంభాన్ని ఇచ్చింది. గతంలో యాషెస్‌తో ప్రారంభించిన హెడ్‌ ప్రదర్శన.. అద్భుతంగా కొనసాగుతోంది. బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. మేం మొదటి రోజు మంచి ఆధిక్యాన్ని ప్రదర్శించాం. ఆ తర్వాత దాన్ని కొనసాగించాం. మధ్యలో భారత్‌ పుంజుకున్నప్పటికీ.. గేమ్‌ మాత్రం మా నియంత్రణలోనే ఉంది. ఇక బోలాండ్‌ నా ఫేవరెట్‌ ఆటగాడు. అందరూ బాగా ఆడారు. ఇది మాకు ఇష్టమైన ఫార్మాట్‌. టెస్టు క్రికెట్‌ చూస్తూ పెరిగాం. ఇది మిమ్మల్ని సవాలు చేస్తుంది. ఇందులో గెలిచినప్పుడు గొప్ప సంతృప్తి లభిస్తుంది’ అని ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌(Pat Cummins) అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు