Deepak Chahar: కొత్త రూల్స్‌ మాకు ఉపయోగం.. బ్యాటర్లు చిత్తే: దీపక్ చాహర్

గుజరాత్‌ను ఓడించడంలో చెన్నై బౌలర్ దీపక్‌ చాహర్‌, శివమ్‌ దూబె కీలక పాత్ర పోషించారు. 

Published : 27 Mar 2024 09:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు దీపక్ చాహర్‌ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులు ఇచ్చాడు. గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (21), శుభ్‌మన్‌ గిల్ (8)ను ఔట్ చేశాడు. ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఐపీఎల్‌ నిర్వాహకులు కొత్త రూల్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చాహర్‌ స్పందించాడు.

‘‘ఇప్పటి వరకు ఆడిన చాలా మ్యాచుల్లో పవర్‌ ప్లేలోనే మూడు ఓవర్లు వేశాను. ఇప్పుడు కూడా ఇలానే సంధించా. కొత్త నిబంధనలు వచ్చాక.. వాటిని అలవాటు చేసుకొనేందుకు ప్రయత్నించా. గతంలో ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో బౌన్సర్‌ వేస్తే.. మిగతావి  లైన్‌ అండ్ లెంగ్త్‌తో వస్తాయని బ్యాటర్లు అంచనా వేసేవారు. ఇప్పుడు ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే వెసులుబాటు లభించింది. దీంతో బ్యాటర్లపై బౌలర్లు పైచేయి సాధించేందుకు  అవకాశం ఉంది. అది పేసర్లకు చాలా ఉపయోగకరం. చెన్నై పిచ్‌పై బౌన్స్ ఎప్పుడూ ఉంటుంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో మంచు ప్రభావం పెద్దగా లేదు. ఇప్పుడు బౌలింగ్‌ చేసే సమయంలో నేను ఇద్దరి వైపు చూస్తా. కెప్టెన్ రుతురాజ్‌తోపాటు మహీ భాయ్‌ సూచనలు కీలకం’’ అని దీపక్ చాహర్ తెలిపాడు. 

చెన్నైకి.. ఇతర ఫ్రాంచైజీలకు ఇదే వ్యత్యాసం: దూబె

‘‘ఐపీఎల్‌లో ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే చెన్నై జట్టుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వారి కోసం కొన్ని మ్యాచ్‌లనైనా గెలిపించాలని భావించా. దాని కోసం చాలా కష్టపడ్డా. గుజరాత్ బౌలర్లు షార్ట్‌ బాల్స్‌తో ఇబ్బంది పెడతారని తెలుసు. అందుకు సిద్ధమై క్రీజ్‌లోకి వెళ్లా. చెన్నై తరఫున అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయాలని భావించా’’ అని దూబె వెల్లడించాడు. గుజరాత్‌పై దూబె 23 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అతడికే వరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని