Unmukt Chand: బీసీసీఐ నిర్ణయం వల్లే.. దేశవాళీ క్రికెట్‌ ఇంకా బతికి ఉంది: ఉన్ముక్త్‌ చంద్

బీసీసీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టే.. దేశవాళీ క్రికెట్‌ మనుగడ సాధిస్తుందని అండర్ -19 మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్ చంద్ వ్యాఖ్యానించాడు. 

Updated : 29 Feb 2024 12:32 IST

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ లీగుల్లో ఆడేందుకు భారత క్రికెటర్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడమే మంచిదైందని అండర్-19 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్ ఉన్ముక్త్‌ చంద్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడు యూఎస్‌ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియాలో విపరీతమైన పోటీ నేపథ్యంలో స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అతడు యూఎస్‌ఏకు తన మకాం మార్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీ20 లీగ్‌ క్రికెట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘బీసీసీఐ భారత ఆటగాళ్లకు విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణాలు ఉంటాయి. అయితే, ఒక ఆటగాడిగా.. ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు వస్తే బాగుంటుందని  నేను అనుకోవడంలో తప్పులేదు. ఆసీస్‌ స్టార్ డేవిడ్‌ వార్నర్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగుల్లో ఆడేస్తాడు. వీటిని తన జాతీయ జట్టులోకి రావడానికి అదొక అవకాశంగా మార్చుకుంటాడు. అయితే, ఇప్పుడు ఎక్కువ లీగ్‌లు మన దేశవాళీ టోర్నీలు జరిగే సమయంలోనూ నిర్వహిస్తుంటారు. రంజీ ట్రోఫీ, టీ20 లీగ్‌, విజయ్‌ హజారే.. ఇలా డొమిస్టిక్ షెడ్యూల్‌ బిజీగా ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లను విదేశీ లీగ్‌ల్లో ఆడించేందుకు అనుమతిస్తే.. దేశవాళీ క్రికెట్‌ అంతమైనట్లే. ఇలాంటి టెక్నికల్‌ అంశాలకు బీసీసీఐ తన సమాధానం ఇస్తుంది. కానీ, వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లి ఆడే అవకాశం ఉంటే బాగుంటుందని అనుకుంటా’’ అని ఉన్ముక్త్‌ తెలిపాడు.

వరల్డ్‌ కప్‌లో భారత్-పాక్‌ మ్యాచ్‌పై..

‘‘దాయాదుల పోరు అంటే అభిమానుల్లో ఎప్పటికీ క్రేజ్‌ ఉంటుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం సర్వత్రా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు యూఎస్‌ వేదికగా తొలిసారి మెగా టోర్నీ జరగనుంది. పెద్ద మైదానాలు భారీగా ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నా. భారత్‌ ఎక్కువగా ఇక్కడ ఆడనుంది. కాబట్టి ప్రతి మ్యాచ్‌ హౌస్‌ఫుల్‌ అవడం ఖాయం’’ అని వ్యాఖ్యానించాడు. జూన్ 9న న్యూయార్క్‌ వేదికగా భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని