World Cup final: ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫలితాన్ని మార్చిన ‘సిక్స్‌’ మా తప్పిదమే: అంపైర్‌ సంచలన వ్యాఖ్య

World Cup final: 2019 నాటి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో కొన్ని పొరపాట్లు జరిగాయని ప్రముఖ అంపైర్‌ మారిస్‌ ఎరాస్మస్‌ అంగీకరించారు. నాటి సంఘటనలను తాజాగా బయటపెట్టారు.

Published : 02 Apr 2024 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌ దశాబ్దాల కలను సాకారం చేసుకుంటూ 2019లో మొట్టమొదటిసారి ప్రపంచకప్‌ (World Cup final 2019) ట్రోఫీని ముద్దాడింది. లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌ (ñª«ENG vs NZ)తో జరిగిన ఫైనల్ పోరులో తీవ్ర ఉత్కంఠ నడుమ చివరకు ఇంగ్లీష్‌ జట్టును విజయం వరించింది. అయితే, ఆ సమయంలో అంపైర్లు ఇచ్చిన ఓ ‘ఆరు పరుగులు’ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రముఖ అంపైర్‌ మారిస్‌ ఎరాస్మస్‌ తాజాగా స్పందించారు. ఆ ‘సిక్స్‌’ తమ తప్పిదమేనని, బహుశా దానివల్లే ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ దక్కి ఉంటుందని అంగీకరించారు.

ఇటీవల న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంపైరింగ్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న ఎరాస్మస్‌ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈసందర్భంగా 2019 నాటి ప్రపంచకప్‌ ఫైనల్‌ గురించి ప్రస్తావించారు. అప్పుడు ఎరాస్మస్‌తో పాటు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన ఫీల్డ్‌ అంపైర్లుగా ఉన్నారు. చివరి ఓవర్లో‌ ఇంగ్లాండ్‌కు 15 పరుగులు కావాల్సిఉంది. క్రీజులో బెన్‌ స్టోక్స్‌, అదిల్‌ రషీద్‌ ఉన్నారు.

రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్‌లో ఎప్పుడూ ఇదే కథ!

నాలుగో బంతికి వీరిద్దరూ రెండో రన్‌కు ప్రయత్నించగా.. మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన బాల్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ చేరుకుంది. దీంతో రెండు రన్లు, బౌండరీని కలిపి అంపైర్లు ఆ బంతికి మొత్తం ‘ఆరు పరుగులు’ ఇచ్చారు. అయితే, గప్తిల్‌ విసిరిన బంతి స్టోక్స్‌ బ్యాట్‌ తగిలే సమయానికి బ్యాటర్లు రెండో పరుగు పూర్తి చేయలేదు. దీంతో ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఐదు రన్స్‌ మాత్రమే ఇవ్వాలి. అంపైర్ల నిర్ణయంతో సమీకరణం చివరి రెండు బాల్స్‌కు మూడు పరుగులుగా మారింది.

ఈ ఘటనపై తాజాగా ఎరాస్మస్‌ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ మరుసటి రోజు నేను హోటల్‌ గది తలుపు తెరవగానే కుమార ధర్మసేన కన్పించారు. ‘మనం నిన్న పెద్ద తప్పిదం చేశామని మీరు గ్రహించలేదా?’ అని ప్రశ్నించారు. అప్పుడే నాకు ఆ విషయం తెలిసొచ్చింది. వారిద్దరూ రెండో పరుగు పూర్తి చేయలేదనే విషయాన్ని మైదానంలో మేం గుర్తించలేకపోయాం’’ అని అంగీకరించారు.

ఇక, కివీస్‌ జట్టులో ఓ బ్యాటర్‌ను కూడా పొరపాటుగా ఎల్బీగా పంపాల్సి వచ్చిందని తెలిపారు. అప్పటికి న్యూజిలాండ్‌కు రివ్యూలు లేకపోవడంతో వారు ఆ వికెట్‌ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత దానికి తాను చాలా చింతించానని చెప్పారు. ‘‘ఆ తప్పిదం జరగకపోయి ఉంటే మ్యాచ్‌ మరో మలుపు తిరిగి ఉండేదేమో’’ అని అభిప్రాయపడ్డారు.

నాటి మ్యాచ్‌ సంగతులివి..

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టు 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ తొలుత తడబడినా.. బెన్‌స్టోక్స్‌ గొప్పగా పోరాడాడు. ఈ క్రమంలోనే చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు కావాల్సిఉండగా.. స్టోక్స్‌ 14 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అక్కడా మ్యాచ్‌ టై అవడంతో బౌండరీ కౌంట్‌ ఆధారంగా ఇంగ్లాండ్‌ విశ్వ విజేతగా నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని