USA - T20 WC 2024: అమెరికన్‌ టీమ్‌.. అంత ఈజీ కాదు!

తొలి మ్యాచ్‌లోనే భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించిన యూఎస్‌ఏ.. తన రెండో మ్యాచ్‌లో డేంజరస్ టీమ్‌ పాక్‌ను చిత్తు చేసి సంచలన విజయం నమోదు చేసింది.

Updated : 07 Jun 2024 12:26 IST

కెనడాపై అద్భుత విజయం.. ప్రత్యర్థి కూడా పసికూనేగా అంటూ కామెంట్లు. ఇప్పుడు ప్రపంచ కప్ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన పాకిస్థాన్‌పై ‘సూపర్’ విక్టరీ.. తమతో వ్యవహారం అంత తేలిక కాదంటూ మిగతా జట్లకూ హెచ్చరికలు పంపింది ‘యూఎస్‌ఏ’.

అసలు ఈ పేరు క్రికెట్‌ మినహా ఇతర క్రీడల్లో మొన్నటి వరకు అభిమానులకు మాత్రమే సుపరిచితం. అక్కడ క్రికెట్‌కు ఆదరణ చాలా తక్కువ. ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్ టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, సంచలన ఆటతీరు ప్రదర్శించగలదని మాత్రం ఎవరూ ఊహించలేదు. యూఎస్‌ఏ సత్తా ఏంటో బంగ్లా సిరీస్‌తోనే వెలుగులోకి వచ్చిందని చాలా మందికి తెలియకపోవచ్చు. 

పునాది అక్కడే.. 

టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు అమెరికా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరిగింది. సొంత మైదానాలు అయినప్పటికీ.. యూఎస్‌ఏ గెలుస్తుందని ఎవరూ భావించలేదు. అనూహ్యంగా బంగ్లాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో యూఎస్‌ఏ పేరు మార్మోగిపోయింది. కెప్టెన్ మోనాంక్‌ పటేల్ తాను ఆడుతూ.. సహచరుల ఆటను వెలికి తీయడంలో సక్సెస్‌ అయ్యాడు. ఆరోన్ జోన్స్, స్టీవెన్ టేలర్ తదితరులు బంగ్లాపై సత్తా చాటారు. ఇప్పుడు వరల్డ్‌ కప్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో సౌరభ్ నేత్రావాల్కర్, నోస్తుష్, జస్‌దీప్‌ మెరుగ్గా రాణించి ప్రత్యర్థులను అడ్డుకుంటున్నారు. బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను గెలిచిన తర్వాత చాలా మంది ఇదంతా ‘గాలివాటం’ విజయాలంటూ వ్యాఖ్యలు చేసినా.. అమెరికా ప్లేయర్లు ఎక్కడా నిరుత్సాహ పడలేదు. తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయడానికి  ‘వరల్డ్‌’ కప్‌ను వేదికగా ఎంచుకోవడం విశేషం. 

టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. పాక్‌పై అమెరికా ‘సూపర్’ విక్టరీ

ఆసీస్‌ మాజీ ఆటగాడి కోచింగ్‌లో..

క్రికెట్‌లో అమెరికా ఇలా మెరుగు కావడానికి ఆ జట్టు ఆటగాళ్ల శ్రమ ఎంత ఉందో.. కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ ప్లేయర్ స్టువర్ట్‌ లా పాత్ర అంతే కీలకం. ఏప్రిల్‌లోనే యూఎస్‌ఏ ప్రధాన కోచ్‌గా వచ్చిన లా జట్టులో జోష్ తీసుకొచ్చాడు. గతంలో బంగ్లా, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం అతడి సొంతం. పొట్టి కప్‌ ముందు ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకునేలా బంగ్లాను ఓడించి యూఎస్‌ఏ ఇక్కడికి వచ్చింది. తొలి రెండు మ్యాచుల్లోనూ గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌ను గెలిస్తే.. సూపర్ 8 దశకు చేరుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. టోర్నీకి ముందు స్టువర్ట్ లా మాట్లాడుతూ ‘‘ఆ ఒక్క రోజు అత్యుత్తమంగా ఆడిన జట్టే గెలుస్తుంది. టీ20 ఫార్మాట్‌లో ఏదైనా సాధ్యమే. అందుకే, టోర్నీలో ఎవరూ ఫేవరేట్‌ కాదు’’ అంటూ తన కుర్రాళ్లకు ఉద్భోద చేశాడు.

మన వాళ్లతో జాగ్రత్త!

అమెరికా జట్టు చూస్తే.. భిన్నత్వంలో ఏకత్వం గుర్తుకొస్తుంది. ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడినవారే. అందులోనూ చాలా మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఇప్పుడు టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న మోనాంక్ పటేల్‌తోపాటు బౌలర్లు సౌరభ్‌ నేత్రావాల్కర్‌, హర్మిత్‌ సింగ్, జస్‌దీప్ సింగ్, నితీశ్‌ కుమార్.. ఇలా ఆ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. టీమ్‌ఇండియా కూడా యూఎస్‌ఏ గ్రూప్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కేవలం పాక్‌తోనే మనకు ముప్పు ఉంటుందని.. మిగతా జట్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాకపోవచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఐర్లాండ్‌ను భారత్‌ తొలి మ్యాచ్‌లో చిత్తు చేసింది. ఇక జూన్ 9న పాక్‌తో మ్యాచ్‌ ఆడనుంది. అయితే, దాయాది జట్టు ఆటను అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు ఓడినంత మాత్రాన తక్కువగా అంచనా వేయకూడదు. ఆ తర్వాత 12వతేదీన యూఎస్‌ఏతో భారత్‌ తలపడనుంది. ఇప్పుడు అమెరికా విజయయాత్రను చూస్తుంటే.. ఆ జట్టుతోనూ జాగ్రత్తగా ఆడాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 

పాక్‌కు ‘సూపర్‌’ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్‌.. ఎవరీ సౌరభ్‌ నేత్రావల్కర్‌?

పిచ్‌లపై పూర్తి అవగాహన?

వరల్డ్ కప్‌ కోసం అమెరికాలో సిద్ధం చేసిన పిచ్‌లు ‘డ్రాప్‌ ఇన్‌’ మోడ్‌లోవే. బంతి ఎలా స్పందిస్తుందో కొత్తగా అక్కడ ఆడేవారికి అర్థం కావడం కాస్త కష్టమే. కానీ, ఇలాంటి పిచ్‌లపై క్రికెట్‌ ఆడిన అనుభవం యూఎస్‌ఏ జట్టుకు కలిసి వచ్చి ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ప్రత్యర్థులు ఇక్కడ పరుగులు చేయడానికి శ్రమిస్తుంటే.. అమెరికా బ్యాటర్లు మాత్రం స్వేచ్ఛగా ఆడేస్తున్నారు. బౌలర్లూ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని