Mohit Sharma: బంతి వేగం 100 కి.మీ కంటే తక్కువే.. అలా ఎందుకు వేశానంటే?: పేసర్‌ మోహిత్

హైదరాబాద్‌పై గుజరాత్ విజయం సాధించడంలో బౌలర్లదే కీలక పాత్ర. ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

Updated : 01 Apr 2024 09:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ సెన్సేషన్‌ స్పెల్‌ వేశాడు. డెత్‌ ఓవర్లలో ఎలా బౌలింగ్‌ చేయాలో యువ బౌలర్లకు అదర్శంగా నిలిచాడు. ఒక దశలో అతడి బంతి వేగం 95 కి.మీ నుంచి 100 కి.మీ మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. స్పిన్నర్‌ వేసే స్పీడ్‌తో వైవిధ్యంగా బంతులను సంధించిన మోహిత్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. భారీ హిట్టర్లు కలిగిన హైదరాబాద్‌ను అడ్డుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. తాను స్లో డెలివరీలను వేయడానికి కారణాలను మోహిత్ వెల్లడించాడు.

‘‘బౌలింగ్‌ ప్రాక్టీస్‌ను ఎప్పుడూ నేను సాధారణంగానే చేస్తా. మ్యాచ్‌ పరిస్థితి బట్టి బౌలింగ్‌లో వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నిస్తా. అదే సమయంలో ఎక్కడ బంతిని సంధిస్తున్నామనేది చాలా కీలకం. రెండు రకాల బంతులను సంధించాలనుకుంటాం. బ్యాటర్లూ సిద్ధంగా ఉంటారు. స్లో బౌన్సర్‌ వేస్తారేమోనని భావిస్తారు. అంతే కానీ స్టంప్స్‌నకు దూరంగా స్లో షార్ట్‌ బాల్‌ వస్తుందని ఊహించలేరు. అలాంటప్పుడే మనం రెండింటిని కలిపి సంధించాలి. మంచు ప్రభావం వల్ల బంతి మన నియంత్రణలో ఉండదు. అందుకోసం ప్రాక్టీస్‌ సమయంలోనే తడి బంతులతో సాధన చేయాలి. అప్పుడు సరైన దిశలో, అనుకున్న విధంగా బంతి వెళ్తే సంతోషిస్తా. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా నేను ఎక్కడ బాగా వేశాను.. ఎక్కడ పొరపాటు చేశాననే విషయాలపై విశ్లేషించుకుంటా. రషీద్, నూర్ అహ్మద్ చాలా చక్కగా బౌలింగ్‌ వేశారు. మధ్యలో మా బ్యాటింగ్‌ నెమ్మదించినప్పటికీ చివరికి విజయం సాధించాం’’ అని మోహిత్ తెలిపాడు. 

ప్రపంచ స్థాయి బౌలింగ్‌తో బరిలోకి దిగాం: గిల్

‘‘సొంతమైదానంలో రెండు మ్యాచ్‌లు గెలవడం ఆనందంగా ఉంది. మా తర్వాత గేమ్‌ కూడా ఇక్కడే. టోర్నీలో మేం మంచి స్థితిలోనే ఉన్నాం. హైదరాబాద్‌ను కట్టడి చేయడంలో బౌలర్లు రషీద్, నూర్, మోహిత్ కీలక పాత్ర పోషించారు. మిడిల్‌ ఓవర్లలో పరుగులు ఎక్కువ ఇవ్వకపోవడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. డెత్‌లో రెండు ఓవర్లను అద్భుతంగా సంధించడం అభినందనీయం. మోహిత్ శర్మ స్లో బంతులతో పరుగులను నియంత్రించాడు. ఈ పిచ్‌పై 160 -170 స్కోరైనా మంచిదేనని భావించా. వృద్ధిమాన్‌ సాహా, డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని కరిగించారు. మిల్లర్ మళ్లీ ఫామ్‌ అందుకోవడం మాకు కలిసొస్తుంది. అతడి ఫిట్‌నెస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని గిల్ స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు