Jos Buttler: ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతాను రాజస్థాన్‌ చివరి బంతికి ఓడించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.

Updated : 17 Apr 2024 11:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో రాజస్థాన్‌ ఆటగాడు జోస్ బట్లర్ (107) అద్భుతం చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాపై చివరి బంతికి జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీ చేసిన అతడు ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఏకాగ్రతతో ఆడి ఆర్‌ఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జోస్ బట్లర్ మాట్లాడాడు. గాయం కారణంగా పంజాబ్‌తో మ్యాచ్‌ ఆడలేకపోయిన బట్లర్‌.. కోల్‌కతాపై నొప్పిని భరించి మరీ పోరాడాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదనను పునరావృతం చేసింది. గతంలో పంజాబ్‌పై (2020లో) 224 పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్‌ పూర్తి చేసింది.

‘‘భారీ లక్ష్య ఛేదనకు దిగినప్పుడు ఆత్మవిశ్వాసంతో ఆడాలి. అదే కీలక పాత్ర పోషిస్తుంది. లయను అందుకోవడానికి ఇబ్బంది పడ్డా. ఎందుకు ఆడలేకపోతున్నానని నిరుత్సాహానికి గురికావడం సహజం. అప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంతా ఓకే.. ఒకటీ రెండు షాట్లు తగిలేవరకూ అలాగే ఆడాలని నా మనస్సుకు సర్ది చెబుతా. ఐపీఎల్‌లో భారీ లక్ష్యాలను ఛేదించడం సహజమే. ధోనీ, విరాట్ కోహ్లీ.. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి తమ జట్లను గెలిపించినవారే. నేను కూడా వారినే అనుసరించా.. చేయగలననే నమ్మకంతో ఆడా. ఇక మా డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్ కుమార్‌ సంగక్కర మాటలు ఎంతో పనిచేశాయి. ఎక్కడో ఒక చోట బ్రేక్‌ పాయింట్  ఉంటుందన్న అతడి సూచనలు వర్కౌట్ అయ్యాయి. దాని కోసం వేచి చూసి బౌలర్లపై ఎదురు దాడి చేశా. కనీస పోరాటం చేయకుండా వికెట్‌ సమర్పించుకోవడం అత్యంత దారుణం. సంగక్కర చెప్పినట్లు క్రీజ్‌లో ఉంటే ఏదొక సమయంలో మలుపు తిరిగేందుకు అవకాశం ఉంటుందని గ్రహించా. ఆ ప్రణాళికలకు అనుగుణంగానే చివరి వరకూ పోరాడాలని నిర్ణయించుకున్నా. ఇప్పటి వరకు నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమం అని చెప్పగలను’’ అని బట్లర్ తెలిపాడు.

నరైన్‌ను టార్గెట్‌ చేయాలనే ఆడా: రోవ్‌మన్ పావెల్

ఓ వైపు జోస్ బట్లర్ జట్టు విజయం కోసం శ్రమిస్తే.. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (13 బంతుల్లో 26 పరుగులు) టార్గెట్‌ను తేలిక చేసేశాడు. కీలక సమయంలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘220+ టార్గెట్‌ను ఛేదిస్తే.. అద్భుతమైన మ్యాచ్‌ అవుతుంది. నేను బ్యాటింగ్‌కు దిగే సమయానికి పరిస్థితి కాస్త కఠినంగానే ఉంది. సునీల్ నరైన్‌పై ఎదురు దాడి చేయాలని భావించా. ఆ జట్టులో అతడే అత్యుత్తమ బౌలర్. నా బ్యాటింగ్‌పై పూర్తి నమ్మకం ఉంది. కోల్‌కతాపై కీలక ఇన్నింగ్స్‌ ఆడటం బాగుంది. సునీల్ నరైన్‌ మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అతడు మాత్రం అవేవీ పట్టించుకోనట్లు ఉన్నాడు. నరైన్ బెస్ట్ ఫ్రెండ్స్‌ పొలార్డ్‌, బ్రావో, పూరన్ అయినా టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టు ప్రకటన లోపు ఒప్పిస్తారేమో చూడాలి’’ అని పావెల్ వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని